AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా.. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Jitta Balakrishna Reddy
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 06, 2024 | 11:25 AM

Share

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా.. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 6) ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఆయన పాత్ర కీలకం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు ఆకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గలో అనేక గ్రామాలలో ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకునేందుకు మంచినీటి సరఫరా వాటర్ ఫిల్టర్ ను పెట్టించారు. సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. జిట్టా బాలకృష్ణా‌రెడ్డి అంత్య్రక్రియలు భువనగిరి శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు 14 డిసెంబర్ 1972న జిట్టా బాలకృష్ణా‌రెడ్డి జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ, పీజీ కళాశాల గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యహారించిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావంతో గులాబీ పార్టీలో చేరారు. పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్నాళ్ల పాటు పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అయితే, రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2022లో బీజేపీలో చేరి‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. ఇటీవలే, 2023 అక్టోబర్ 20న తిరిగి జిట్టా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..