గురువారం నాడు తెలంగాణ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ భేటీ జరుగనుంది. అంతకంటే ముందు, అంటే బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. తాజా రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. బుధవారం శాసనసభాపక్షం, గురువారం కేబినెట్ భేటీ వరుసగా జరుపడం వెనుక నిగూఢ రహస్యం ఏంటనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కేసీఆర్ నయా వ్యూహంలో భాగంగానే ఈ సమావేశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఈ రెండు సమావేశాల్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం.. బీజేపీ ఓటమిపాలవడం.. తదుపరి ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కర్నాటకలో ఓటమిపాలైన బీజేపీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్లాన్స్ వేస్తోంది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బడా బడా నేతలు రాష్ట్రానికి వరుసగా వస్తుండగా.. ఇప్పుడు మరికొందరు నేతలను రంగంలోకి దించి.. పూర్తి స్థాయిలో తెలంగాణపై ఫోకస్ పెట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఇలాంటి తరుణంలో బుధ, గురువారాల్లో జరుగనున్న కీలక భేటీల్లో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..