
అబ్ కీ బార్.. చార్ సౌ పార్.. అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్న భారతీయ జనతా పార్టీ.. తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. ఎంపీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచార వ్యూహాలపై కమలనాథులు హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరితో విడివిడిగా రివ్యూ చేసి ఆయా స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకునే లక్ష్యంతో లోక్‌సభ ఎన్నికల సమరంలోకి దూకింది బీజేపీ. డబుల్ డిజిట్ టార్గెట్‌గా ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. ఇదే తరుణంలో ఎన్నికల వ్యూహాలకు మరింత పదునుపెట్టేలా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పార్టీ జాతీయ నేతలు సునీల్ భన్సల్, తరుణ్ చుగ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ముఖాముఖి చర్చించారు. ఖరారైన 15 మంది ఎంపీ అభ్యర్థులతో విడివిడిగా చర్చలు జరిపారు.
లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు, బూత్ లెవల్ కో ఆర్డినేషన్, కొత్త, పాత నేతల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంతో పాటు గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణతో వెళుతున్నారనే విషయాలను అభ్యర్థుల నుంచి రాబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలు అవుతున్నాయని ఎంపీ అభ్యర్థులు నేతలకు వివరించారు.
అలాగే సభలు, సమావేశాల కంటే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రధాని మోదీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఓటర్‌ను బీజేపీ కార్యకర్తలు కలవాలని జాతీయ నేతలు ఎంపీ అభ్యర్థులకు సూచించారు. బీజేపీ పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ మాటల గారడి చేస్తోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పదాదికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 29లోపు పార్లమెంట్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ ఒకటి వరకూ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 6న రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ బ్రేక్ ఫాస్ట్ బైటక్‌ల పేరుతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో బూత్ లో కనీసం 370 కొత్త ఓట్లు వేయించాలని.. దేశంలో సింగిల్ గా 370 ఎంపీ స్థానాలు సాధించాలనే పక్కా వ్యూహంతో వెళుతోంది బీజేపీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…