Talasani Srinivas Yadav Comments: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ సహా పలు ప్రధాన పార్టీలకు చెందిన నేతలందరూ ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత గొల్ల, కుర్మలకు స్వాతంత్ర్యం వచ్చిందని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. కుల వృత్తులను కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తలసాని వివరించారు. గొర్రెల పంపిణీ అనేది హుజూరాబాద్‌లోనే కాదని.. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కుల వృత్తులు బాగుపడ్డాయని తలసాని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు కేసీఆర్ కుటుంబంపై ఏడుస్తున్నారని.. వారిని ఎవరూ పట్టించుకోరంటూ పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వంతో తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలంటూ తలసాని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. తనది ఆత్మగౌరవ సమస్య కాదని.. వ్యక్తిగత సమస్య అంటూ తలసాని పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాలతోనే రాజీనామా చేశారని పేర్కొన్నారు.
హీరో నానీ కామెంట్స్‌పై స్పందించిన తలసాని..
సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్నారన్న హీరో నాని చేసిన కామెంట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవాలని గతంలోనే చెప్పామంటూ తలసాని పేర్కొన్నారు. తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదంటూ స్పష్టంచేశారు. ఇప్పటికే థియేటర్లను ఓపెన్ చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించామని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జరిగిన తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది మన కల్చర్.. అని థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూడటం అనేది మన బ్లడ్‌లోనే ఉందన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు విధిస్తారని.. ఇది ఎందుకంటూ విమర్శించారు.
Also Read: