T Congress: ఎమ్మెల్సీ ఫలితాలపై టీపీసీసీలో అంతర్మథనం.. మరిన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటే బాగుండేదంటున్న నేతలు..
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీ- కాంగ్రెస్ లో అంథర్మథనం మొదలైందా?.. గట్టిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని నేతలంతా ఇప్పుడు మధనపడుతున్నారా?..కనీసం ఆ రెండు స్థానాల్లోనైనా దృష్టి పెడితే
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీ- కాంగ్రెస్ లో అంథర్మథనం మొదలైందా?.. గట్టిగా పోటీ చేసి ఉంటే బాగుండేదని నేతలంతా ఇప్పుడు మధనపడుతున్నారా?..కనీసం ఆ రెండు స్థానాల్లోనైనా దృష్టి పెడితే బాగుండేదని భావిస్తున్నారా?.. టీపీసీసీ అలా ఆలోచించకపోవడానికి హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల భయమేనా?.. అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కాస్త జోష్ వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ యూత్‌లోనూ దూకుడు పెరిగింది. అయితే అంతలోనే వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్లు రావడంతో కాంగ్రెస్ క్యాడర్‌ను మళ్లీ నిరాశకు గురిచేసింది. బై పోల్ ఫలితాలపై ఏకంగా ఢిల్లీ లెవల్ లో డిస్కస్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వస్తే ఎలా..అనే భయంతో పీసీసీ పోటీకి దూరంగా ఉండిపోయింది. దీంతో జిల్లా నేతల అభీష్టానికే ఆ నిర్ణయాన్ని వదిలేసింది.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్థానిక నేతలు, ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత ఉందనే విషయం మెల్లమెల్లగా బయటకొచ్చింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో కేవలం పట్టున్న కొన్ని జిల్లాలో మాత్రమే పోటీకి దిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే బలమైన స్థానాలు, పట్టు ఉండి కూడా నల్గొండలో పోటీ చేయలేదు. అయితే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో కాస్త బలంగా పోటీచేసి ఉంటే బాగుండేదనే ఆలోచనలో పడ్డారట టీ- కాంగ్రెస్ నేతలు. మెదక్ లో జగ్గారెడ్డి 230 స్థానాలకు సవాల్ చేసి సింగిల్ హ్యాండ్ తో 238 ఓట్లు దక్కించుకున్నారు. పార్టీ సీరియస్ గా తీసుకుని సపోర్ట్ చేసి ఇంకొన్ని ఓట్లు వచ్చేవనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అయితే లోకల్ నాయకులు ఎందుకు పోటీ నిలబెట్టలేదు అని జిల్లా స్థాయి నాయకులను అడిగితే ‘పీసీసీ నిర్ణయానుసరంగానే పోటీ చేయలేదు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు’ అని చెప్పుకొస్తున్నారట… కొంత మంది సీనియర్ నాయకులు అయితే రేవంత్ నిర్ణయం తప్పని ఆయన సరైన నిర్ణయం ప్రకటించకపోవడం తో ఇతర నాయకులు కూడా మాకెందుకు వొచ్చిందని సైలెంట్ అయ్యారని దీని వల్ల పార్టీ మరింత నష్టపోతుందని అంటున్నారట
గ్రౌండ్ లెవల్ లో ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీలో వర్గవిభేదాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావితం చూపాయాని, ఈ సమస్యలను ముందే పరిష్కరించుకుని బరిలోకి దిగి ఉంటే ఒకటి రెండు చోట్ల మంచి ఫలితాలు వచ్చేవని కొందరు కాంగ్రెస్ నేతల వాదన. ఏదీ ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటున్నారు సీనియర్ లీడర్లు.