Hyderabad: ప్రాచీన భారత్ గురించి తెలిస్తేనే భవిష్యత్‌లో అద్భుత భారతాన్ని నిర్మించగలం: స్వామి బోధమయానంద
Hyderabad: స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ మనస్సు ఉంటేనే సాధ్యమౌతుందని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.
Hyderabad: స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ మనస్సు ఉంటేనే సాధ్యమౌతుందని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ప్రాచీన భారత దేశం మూలాల గురించి తెలుసుకోవడం వల్ల గొప్ప భవిష్యత్తును నిర్మించేందుకు వర్తమానం అవకాశం కల్పిస్తుందని స్వామి బోధమయానంద గుర్తు చేశారు. రేడియంట్ ఇండియా, రెసిలియంట్ ఇండియా, రిసర్జంట్ ఇండియా అంటూ మూడు రకాల భారత్‌ల గురించి బోధమయానంద వివరించారు. ప్రాచీన భారత్ గొప్పగా వెలిగొందిందని, మధ్య భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచిందని, ప్రస్తుత భారత్ విశ్వగురువుగా పునరుత్థానం చెందుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అతిథిగా వచ్చిన తెలంగాణ హైకోర్ట్ సీనియర్ కౌన్సిల్ రవిచందర్ మాట్లాడుతూ.. లింగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆడ, మగ అనే బేధం లేకుండా పిల్లలను పెంచితే మంచి సమాజం నిర్మాణమౌతుందన్నారు. విద్యార్థులకు సొంత ఆలోచనా సామర్థ్యము, వ్యక్తిత్వము, క్రమశిక్షణ ముఖ్యమని చెప్పారు. ధర్మం కోసం పోరాడాలని, తప్పును వ్యతిరేకించడం తప్పు కాదన్నారు. సోషల్ మీడియాకు బానిసలు కావొద్దని రవిచంద్ర విద్యార్థులకు సూచించారు.
ముఖ్య వక్తగా హాజరైన డెక్స్‌టెరిటీ వ్యవస్థాపకుడు శరద్ వివేక్ సాగర్ మాట్లాడుతూ.. పేదల మనసు చూసి చలించే గుణం ఉందా అని విద్యార్ధులను ప్రశ్నించారు. చలించే గుణం ఉంటే, వారిని ఆదుకునే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. స్వామి వివేకానందుడు కూడా ఇదే సూచించారని ఆయన గుర్తు చేశారు. స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదివితే సమస్యలు పరిష్కరించుకోగలిగే నేర్పు వస్తుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..