రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈ సారి ముందుగానే కేరళా తీరానికి రుతుపవనాలు.. తెలంగాణకు ఎప్పుడంటే?
Southwest Monsoon 2026: దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సకాలం కంటే కాస్త ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయిని పేర్కొంది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి మే 26వ తేదీనే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే దేశాన్ని పలకరించనున్నాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ అండం నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలోకి ఎప్పుడు?
ఇక కేరళ తీరాన్ని తాకే ఈ రుతుపవనాలు జూన్ మొదటి వారాంతంలో లేదా జూన్ రెండో వారం ప్రారంభంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర దిశగా కదులుతున్న ‘మిసో’ సిగ్నల్స్ ముందుగానే ప్రారంభం కావడం వల్ల, జూన్ మొదటి వారం రోజుల్లోనే రుతుపవనాలు తెలంగాణలోకి బలంగా ప్రవేశించే ఛాన్స్ ఉంది. అయితే గ్లోబల్ వాతావరణ మార్పులైన ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈసారి రుతుపవనాల ప్రవేశం సకాలంలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు
ఓ వైపు రుతుపవనాల రాక సూచికలు ఉన్నప్పటికీ దేశంలో భిన్న వాతావరణ పరిస్తితులు నెలకొంటున్నాయి. రాబోయే వారంలో వాయువ్య, మధ్య భారతదేశంలో సాధారణం నుండి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని. అలాగే ఈశాన్య భారతదేశంతో పాటు రాబోయే 3-4 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే, దక్షిణ అంతర్గత కర్ణాటకలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
