Monsoon: జూన్‌ 12న రాష్ట్రానికి నైరుతి రాక.. మరో వారంలో మండే ఎండలకు గుడ్ బై..!

పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్న వేళ భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ఆగమించనున్నట్లు వెల్లడించింది. దీంతో మరో వారం రోజుల్లోనే ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలగనుంది..

Monsoon: జూన్‌ 12న రాష్ట్రానికి నైరుతి రాక.. మరో వారంలో మండే ఎండలకు గుడ్ బై..!
Southwest Monsoon

Updated on: May 14, 2025 | 11:41 AM

హైదరాబాద్‌, మే 14: దేశ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికే దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్టు వెల్లడించింది. వ్యవసాయ దేశమైన భారత్‌కి అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చేది నైరుతి రుతుపవనాలే. బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని వెల్లడించింది. దీంతో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. అండమాన్‌ నుంచి దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు మే 27 నాటికి కేరళను తాకనున్నాయి. ఈ క్రమంలో జూన్‌ 12న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ముందుగానే వచ్చిన రుతుపవనాలతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే IMD స్పష్టం చేసింది.

నైరుతి ఆగమన నేపథ్యంలో మరో వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మే 13 భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా సిద్దిపేట, జనగామ, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మహబూబాబాద్‌, భువనగిరి, కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల పిడుగులు కూడా పడినట్టు పేర్కొన్నది. కాస్త ముందుగానే వర్షాలు పడుతుండటంతో  రైతులు సేద్యం పనుల్లో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.