Hyderabad: ఆస్పత్రికి తీసుకెళ్తనని.. అమ్మను రోడ్డుపైనే వదిలేశాడు! ఆకలితో అలమటించి కన్నుమూత

|

Jul 30, 2024 | 8:20 PM

అనారోగ్యానికి గురైన ఓ అమ్మను ఓ కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి, మార్గమధ్యంలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఆ తల్లి రెండు రోజులు ఎదురు చూసింది. ఆకలి దప్పులతో అలమటించింది.. చివరికి ఆ తల్లి గుండె పగిలి కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాలు...

Hyderabad: ఆస్పత్రికి తీసుకెళ్తనని.. అమ్మను రోడ్డుపైనే వదిలేశాడు! ఆకలితో అలమటించి కన్నుమూత
Son Left Mother On Road In Hyderabad
Follow us on

హైదరాబాద్‌, జులై 30: తన పంచప్రాణాలు పోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. పురిటి బిడ్డ బోసి నవ్వులు చూసుకుని అప్పటి వరకు పడిన వేదనంతా మరచిపోతుంది. పేదింటిలో పుట్టినా నానా చాకిరి చేసి తన గారాల బిడ్డ కడుపు నింపుకుని మురిసిపోతుంది. ముదుసలైన తర్వాత తనకు మూడో కాలు అవుతాడని ఎన్నో కలలు కంటుంది. కానీ నేటి కాలం పిల్లలు తమ తల్లిదండ్రుల పాలిట యమకింకరులు అవుతున్నారు. వారికి పట్టెడన్నం పెట్టడానికి నేల చూపులు చూస్తున్నారు. బిడ్డలు చేస్తున్న ఘోరాలు చూడలేక కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరేమో తమ రక్తమేగా ఎన్నటికైనా మనసు మారుతుందేమోనని ఆశగా కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి వారికి నిరాశే.. ఎదురుపడుతుందని తాజా సంఘన వెల్లడించింది. అనారోగ్యానికి గురైన ఓ అమ్మను ఓ కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి, మార్గమధ్యంలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఆ తల్లి రెండు రోజులు ఎదురు చూసింది. ఆకలి దప్పులతో అలమటించింది.. చివరికి ఆ తల్లి గుండె పగిలి కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాలు…

మేడ్చల్‌కి చెందిన అరవింద్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తల్లి శ్యామల (60)ను తీసుకొని జులై 5వ తేదీన ఆసుపత్రికని బయలుదేరాడు. బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్‌ సమీపంలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌ వద్ద ఆమెను ఫుట్‌పాత్‌పైనే వదిలి చిన్నగా జారుకున్నాడు. రెండు రోజులైనా అతడి జాడలేదు. అసలే అనారోగ్యం.. ఆపై ఆకలితో అలమటించిన ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు గమనించి బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి 108 అంబులెన్స్‌లో శ్యామలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ కోలుకున్న శ్యామల నుంచి 3 రోజుల క్రితం పోలీసులు వివరాలు సేకరించారు. కుమారుడి వివరాలు చెప్పి, ఒక్కసారి చూడాలని శ్యామల కోరడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఆమె కొడుకు అరవింద్‌ కోసం మేడ్చల్‌లో ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సదరు మహిళ ఫొటోను పోలీసులు మీడియాకు అందించి, తెలిసినవారు ఎవరైనా ఉంటే బోయిన్‌పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.