
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ లోనే పుట్టారు..ఎంఐఎంలోనే పెరిగారు. ఎంఐఎంతో లబ్ధిపొందారు. ఏమైందో ఏమో కానీ పెద్ద పెద్ద ధనవంతులు, వ్యాపారులు, మత పెద్దలు ఒక్కొక్కరుగా ఇతర రాజకీయ పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. పాతబస్తీలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అనేక సమస్యలతో సతమతం అవుతున్నామని అంటున్నారు. ఇతర పార్టీల్లోంచి గెలిచి పాతబస్తీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. చార్మినార్ అద్భుత కట్టడాన్ని చూసేందుకు దేశంలోని పలు ప్రాంతల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. చార్మినార్ ఎంత ఫేమస్ అయిందో.. ఈ పాతబస్తీ ప్రాంతంలో సమస్యలు కూడా అన్నే ఉన్నాయి. ఏళ్ల తరబడి అభివద్ధికి నోచుకోక అలాగే ఉండిపోయింది. ఇక్కడ కొన్నేళ్లుగా అధికారంలో ఉన్న మజ్లిస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయిందని కొందరు ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
అలాగే తమ నియోజకవర్గాల్లో కూడా తిరగలేకపోతున్నామని, ఎక్కడికి వెళ్లినా తమను ప్రజలు సమస్యలపై నిలదీస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా పాతబస్తీలో చాలా అభివృద్ధి పనులు చేశామని, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, చెత్త నిర్వహణలాంటివి ఎన్నో చేశామని ఎంఐఎం నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా చిన్నారులకు చక్కటి విద్య, ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని అంటున్నారు. పార్టీపై ఇలాంటి విమర్శలు చేయడం కొందరు నేతలకు అలవాటుగా మారిందని, పార్టీ నుంచి లబ్ధిపొంది ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని చెబుతున్నారు. ఎంఐఎంలో కొందరు అగ్రనేతలు అభివృద్ధి చెందారు తప్ప పాతబస్తీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అసంతృప్తులు అంటున్నారు. ఒకప్పుడు పాతబస్తీ నుంచి ముస్లిం మతపెద్దలు, వ్యాపార వేత్తలు ఇతర పార్టీల నుంచి ఎంఐఎంలో చేరేవారు. కానీ కాలం మారింది..ఆలోచనలు మారాయి. యువత అభివృద్ధి కోరుకుంటోంది. అందువల్లే కావచ్చు మతపెద్దల్లో కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి.
ఒకప్పుడు పాతబస్తీ మతపెద్దలకు రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ ఓటు బ్యాంక్‌పై మంచి పట్టుఉండేది. ఒక్కమాట చెబితే చాలు ముస్లింలంతా ఎంఐఎంకే ఏకపక్షంగా ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ మత పెద్దలను కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు. యువత కూడా మారిపోయారు. మత పెద్దలు చెప్పినా ఓట్లు వేసే పరిస్థితిలో లేరు. యువత మొత్తం చదువు, వారి భవిష్యత్‌పై దృష్టిపెట్టడంతో పాటు తమ ప్రాంత అభివృద్ధి ఏమైందంటూ అక్కడి నేతలను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా నేతలు ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM)ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అయితే ఇతర పార్టీలు వీరిని ఎలా రిసీవ్ చేసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీల్లో వీరికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థంకాని పరిస్థితి. గతంలో చాలా మంది కీలక నేతలు ఎంఐఎం నుంచి బయటికి వెళ్లారు. కానీ వారు ఇతర పార్టీల్లో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా దెబ్బతిని, అక్కడి నేతలతో ఇమడలేక తిరిగి సొంతగూడు అయిన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM)లోకి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరికొందరు మాత్రం వెనక్కి రాలేక ఉన్న పార్టీలో పొసగలేక అయోమయంలో ఉన్నారు. సరైన సమయం చూసి ఓ నిర్ణయానికి వస్తామని అంటున్నారు. ఎవరి నిర్ణయం వారిదే, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, అంతా కాలమే నిర్ణయిస్తుంది.