
పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ వేట కొనసాగుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు పోటీకి వెనకడుగు వేస్తుండడంతో గులాబీ అధిష్టానానికి మింగుడుపడడం లేదు. ఓ వైపు పార్టీ అభ్యర్థి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క తనకే సిటు కేటాయించాలని సిట్టింగ్ ఎంపీ పట్టుపడుతున్నాడట. స్థానిక ఎమ్మేల్యేలతో కలిసి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్నగర్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బలమైన నేతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో అధిష్టానం ఉంది. ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్న నేపథ్యంలో గట్టి పోటీ ఇవ్వాలని పాలమూరు గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థి ఎవరూ అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
క్యాండిడేట్ కోసం పార్టీ వెతుకుతుంటే.. సీటు కోసం అధిష్టానం నేతలను వెతుక్కుంటు వెళ్తున్నారు సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలో ఉండడం, పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు చెందిన వారే కావడంతో గెలుపు సునాయసంగా సాగింది. కానీ ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినప్పటికీ తాను బరిలో ఉంటానని అధిష్టానానికి చెబుతున్నారట మన్నే. ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేల మద్ధతు సైతం కోరుతున్నాడని తెలిసింది. ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న కుమారుడు పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలుస్తోంది.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉంటానని అనడం జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యానికి గురిచేస్తోందట. అంతేకాకుండా తాను టికెట్ తెచ్చుకుంటాను ఓడిన మాజీ ఎమ్మెల్యేలు తన కోసం పనిచేయాలని కోరుతున్నాడట మన్నే శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటికే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ ఆశావాహ అభ్యర్థులు టికెట్ కోసం పోటి పడుతుంటే బీఆర్ఎస్లో మాత్రం టికెట్ ఇస్తామన్నా.. కీలక నేతలు వద్దంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ మాత్రం తనకు అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…