AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మరమగ్గాలను స్క్రాప్‌లో అమ్మేసుకుంటున్న ఆసాములు

ప్రభుత్వం కొంత మేరకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కు సంబంధించిన ఆర్డర్ ఇచ్చినప్పటికీ, అందులో సింహభాగం టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకే అందింది. పాతతరం పవర్లూమ్ లపై ఉత్పత్తి అయ్యే బట్టకు ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమ బంద్ కొనసాగుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంటే తిరిగి సిరిసిల్లకు పూర్వ వైభవం వస్తుందని ఆశతో నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు.

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మరమగ్గాలను స్క్రాప్‌లో అమ్మేసుకుంటున్న ఆసాములు
Sirisilla Pallister Textile
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 26, 2024 | 3:05 PM

Share

దశాబ్దాల కిందటి పీడ రోజులు సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమను మళ్లీ చుట్టుముట్టనున్నాయన్న ఆందోళన సిరిసిల్ల నేతన్నల్లో కనబడుతుంది.. బట్టను నేసి బతుకు సాగించే నేతన్నలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఒకనాడు రాష్ట్రంలోనే నేత పరిశ్రమకు కేంద్రంగా  విలసిల్లిన సిరిసిల్ల.. చీరలు, టవళ్ళు, లుంగీలు,లాంటి ఎన్నోరకాలైనటువంటి వస్త్రాలను నేస్తూ ఇక్కడి వస్త్ర పరిశ్రమ చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పించేది. సుమారు 30 వేలకు పైగా పవర్ లూమ్ లతో రాష్ట్రంలొనే అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా సిరిసిల్ల కొనసాగింది. కాలక్రమేన సొంతంగా మార్కెట్ ను చేసుకొనే ఉత్పత్తులను వదిలివేసి, జాబ్ వర్క్ పై పాలిస్టర్ మతక రకం తెల్ల బట్టను ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కీర్తి మసకబారడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాల క్రితం పవర్లూమ్ పరిశ్రమకు ఆర్డర్లు లేక తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆనాడు వందల మంది నేత కార్మికులు ఉపాధి కరువై, బొంబాయి, భివండి వలస బాటల బాట పట్టడం దేశంలోనే చర్చనీయాంశమైంది.

తరువాత స్థానిక ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించే బట్ట సిరిసిల్ల నేతన్న కు ఆర్డర్ ఇచ్చారు..తరువాత బతుకమ్మ చీరలు..స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్ ఇచ్చారు. కాస్తా పని పె రిగింది.. గత ఏడు సంవత్సరాలుగా కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడడంతో ప్రైవేట్ ఆర్డర్లు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చేయడానికి పని లేక, నేతన్నల బతుకులు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అదే విధంగా.. బతుకమ్మ చీరాల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి.. కొత్త ఆర్డర్స్ రావడం లేదు.. ఈ క్రమం లో మూడు నెలలుగా సరిగా పని లేక నేతన్నలు ఇబ్బంది పడుతున్నారు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సుమారు 270 కోట్ల వరకు ఆగిపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్తంభించిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 50 కోట్ల మేర బకాయిలు చెల్లించినప్పటికీ వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడలేదు. ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడంతో కొత్తగా ప్రైవేటు వ్యక్తుల ఆర్డర్లకు పనిచేద్దామన్నా, పెట్టుబడి లేక యజమానులు వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేశారు. దీంతో మూడు అంచెల వ్యవస్థ ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో దిగువన ఉన్న ఆసాములు, కార్మికులు ఉపాధి లేక వీధిన పడుతున్నారు. గత మూడు నెలలుగా సిరిసిల్లలోని పవర్లూమ్ లు పూర్తిగా మూగపోవడంతో రెక్కాడితే గాని డొక్కాడని నేతన్నల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మూలిగే నక్క పై తాటి పండులా మారిన కరెంటు సబ్సిడీ నిలిపివేశారు. వస్త్ర పరిశ్రమకు ఆర్డర్ల కొరత ఒకవైపు వేధిస్తుండగానే కరెంటు సబ్సిడీపై ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.అరకొరగా నడుస్తున్న పవర్లూమ్ పరిశ్రమ వ్యాపారానికి  కరెంటు సబ్సిడీ నిలిపివేత పెను శాపంగా మారింది. పది హెచ్పీలకు మించి విద్యుత్ వినియోగంపై సబ్సిడీని ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వస్త్ర పరిశ్రమలో 10 హెచ్పి ల వరకు విద్యుత్ వినియోగంపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలన్న జీవో పాతదే అయినప్పటికీ గత ప్రభుత్వంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అందరికీ విద్యుత్ సబ్సిడీ కొనసాగింది. 10 హెచ్పి ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న పవర్లూమ్ పరిశ్రమలకు కూడా సబ్సిడీని నిలిపివేశారు. దీంతో యూనిట్కు నాలుగు రూపాయల నుండి 8 రూపాయలకు విద్యుత్ చార్జీలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్త్ర వ్యాపారం గిట్టుబాటు కాక పవర్లూమ్ పరిశ్రమను నడపడం లేదు. మరోవైపు అప్పులకు వడ్డీలు కట్టలేక చిన్నాచితక ఆసాములు తమ పవర్లూమ్ మగ్గాలను స్క్రాప్ కింద అమ్ముకుంటున్నారు.గతం లో 30,000గా ఉన్న పవర్లూమ్ మగ్గాలు నేడు 20,000 కంటే దిగువకు తగ్గిపోవడం పరిశ్రమలో ఉన్న తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మగ్గాలు కూడా గత ఆరు, ఏడు నెలలుగా పని లేక మూతపడడంతో నేతన్నల బతుకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.

ప్రభుత్వం కొంత మేరకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కు సంబంధించిన ఆర్డర్ ఇచ్చినప్పటికీ, అందులో సింహభాగం టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకే అందింది. పాతతరం పవర్లూమ్ లపై ఉత్పత్తి అయ్యే బట్టకు ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవడంతో పవర్లూమ్ పరిశ్రమ బంద్ కొనసాగుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంటే తిరిగి సిరిసిల్లకు పూర్వ వైభవం వస్తుందని ఆశతో నేత కార్మికులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..