Niranjan Reddy: అబద్దాలు చెబుతున్నారు.. యాసంగిలో వరి అసలే వద్దు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

|

Dec 05, 2021 | 6:31 PM

Singireddy Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవంటూ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం నిలబడేది, పోరాడేది టీఆర్ఎస్

Niranjan Reddy: అబద్దాలు చెబుతున్నారు.. యాసంగిలో వరి అసలే వద్దు: మంత్రి నిరంజన్‌ రెడ్డి
Singireddy Niranjan Reddy
Follow us on

Singireddy Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవంటూ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం నిలబడేది, పోరాడేది టీఆర్ఎస్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. వరి కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై నిరంజన్ రెడ్డి ఆదివారం మాట్లాడారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యత తీసుకుంటుందన్నారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదంటూ మంత్రి పేర్కొన్నారు. వాళ్ల బియ్యం వాళ్లు తీసుకుపోకుండా పంపలేదంటూ రాష్ట్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. రా రైస్, పార్ బాయిల్డ్ రైస్ కు తేడా తెల్వని వాళ్లు బీజేపీ ఎంపీలు కావడం మన దురదృష్టం అంటూ ఎద్దెవా చేశారు. పార్ బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) విధానం పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ అని.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్ట లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఏడేండ్ల కాలంలో అత్యధిక శాతం కేంద్రం కొనుగోలు చేసింది పార్ బాయిల్డ్ బియ్యమేనని గుర్తుచేశారు. ఇప్పుడు వంద శాతం బియ్యం సేకరించమని తేల్చిచెప్పడం దుర్మార్గం అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఏమార్చే విధానం మంచిది కాదంటూ సూచించారు.

దేశంలో ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ రైతుల పక్షాన కొట్లాడకుండా చేతులెత్తేయడం గమనార్హమన్నారు. వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయట పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నడూ తెలంగాణ ప్రయోజనాలు కోసం పోరాడవన్నారు. కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని తెలిపారు. దీనిని భవిష్యత్ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలు ఉండాలి.. కానీ కేంద్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయం ఉజ్వలంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తుందన్నారు.

రైతు పంట కోసం కష్టపడినట్లే.. రైతుల బాగు కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని నిరంజన్‌ రెడ్డి స్పష్టంచేశారు. యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు సూచించారు. యాసంగి పంట కోసం ఎలాంటి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదని తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read:

Viral Video: ఈ గురుడికి ఆత్రం ఆగలేదు.. అమ్మాయిలతో స్టంట్‌.. సీన్‌ కట్‌చేస్తే ఫ్యూజులు ఔట్‌.. వీడియో వైరల్‌

Cheetah Hulchul: షిర్డీ సమీపంలోని శ్రీరాంపూర్‌లో చిరుత టెర్రర్.. ఊరు మొత్తం అతలాకుతలం