
మద్యం మత్తులో పెట్రోల్ తాగడంతో తీవ్ర అస్వస్థతతకు గురై యువకుడు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఎండీ ఫయాజ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మందు తాగి ఇంటికి వచ్చేవాడు. రోజూలానే నిన్న కూడా ఫుల్‌గా తాగిన ఫయాజ్ మత్తులో లచ్చపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల వెనుక తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్‌ను తీసుకొని తాగేశాడు.
పెట్రోల్ తాగిన కాసేపటికే ఫయాజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అది గమనించిన స్థానికలు అతని స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేహితుడు, కుటుంబ సభ్యులు ఫయాజ్‌ను తొలుత దుబ్బాకలోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి వెళ్లాక పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఫయాజ్ గురువారం అర్ధరాత్రి కన్నుమూశాడు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా వ్యసనానికి బలై పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.