Crop Holiday: లక్ష ఎకరాలకు క్రాప్ హాలిడే…ఆందోళనలో రైతులు.. అసలు కారణం ఇదే..

| Edited By: Srikar T

Dec 29, 2023 | 10:04 PM

పాలమూరు రైతులకు కృష్ణమ్మ ఈ యాసంగికి కన్నీళ్ళే మిగిల్చింది. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు ఆశలు అవిరయ్యాయి. వర్షాలు కురువకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవు. దీంతో దాదాపు రెండు నెలల నుంచి వానకాలం సీజన్ పంటలకే వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు అధికారులు

Crop Holiday: లక్ష ఎకరాలకు క్రాప్ హాలిడే...ఆందోళనలో రైతులు.. అసలు కారణం ఇదే..
Jurala Project
Follow us on

పాలమూరు రైతులకు కృష్ణమ్మ ఈ యాసంగికి కన్నీళ్ళే మిగిల్చింది. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు ఆశలు అవిరయ్యాయి. వర్షాలు కురువకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవు. దీంతో దాదాపు రెండు నెలల నుంచి వానకాలం సీజన్ పంటలకే వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక యాసంగికి క్రాప్ హాలీడే ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇటివల హైదరాబాద్‎లో జరిగిన నీటిపారుదల అధికారుల సమావేశంలో జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అంశంపై చర్చ జరిగింది. సాగు కన్నా, తాగునీటి అవసరాలకు పెద్దపీట వేయడంలో పంటల విరామం తప్పదనే అభిప్రాయానికి వచ్చారు అధికారులు. దీంతో చేసేది లేక క్రాప్ హాలిడే వైపే మొగ్గుచూపారు.

సాగు, త్రాగు, కరెంటుకు ప్రధాన వనరు జూరాల ప్రాజెక్టు:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగు, సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు జూరాల ప్రాజెక్ట్. అయితే జూరాల ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల ద్వారా దాదాపు ఒక లక్ష ఐదువేల ఎకరాల సాగువిస్తీర్ణంలో ఉంది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ దాదాపు 100 కిలోమీటర్ల పొడవునా 10 మండలాల మీదుగా సాగుతుంది. ఈ కాలువ జూరాల డ్యాం నుంచి సుమారు పెంట్లవెల్లి మండలం వరకు ఉంది. అధికారికంగా 70వేల ఆయకట్టు ఉంటే, అనధికారికంగా మరో 30వేల ఎకరాలు మోటర్ల ద్వారా సాగులోకి వస్తున్నది. ఎగువన నారాయణపూర్‌ డ్యాం కింద కూడా యాసంగిలో క్రాప్ హాలీడే ప్రకటించారు. డ్యాంలో నీటి పరిస్థితులను బట్టి అక్కడ కూడా రెండో పంటకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే నారాయణపూర్‌ డ్యాం కింద రెండవ పంట సాగైతే, దిగువన జూరాలకు కొంత నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగువన ప్రాజెక్టు సైతం పంట విరామం ప్రకటించడంతో జూరాల కింద యాసంగి కష్టంగా మారింది. ఇక జూరాల ప్రాజెక్ట్ నీటి నిల్వ, అవసరాల దృష్ట్యా, ఇతర పరిస్థితుల కారణంగా ఈ యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించకతప్పడం లేదని వనపర్తి సర్కిల్ ఎస్ఈ సత్యశీలారెడ్డి వెల్లడించారు.

వారబందీ విధానంలోనైనా నీరందించండనీ రైతుల వేడుకోలు:

జూరాల ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ 9.16టీఎంసీలలో ప్రస్తుతం 4.9టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. తాగునీటి అవసరాలకు పోగా మిగిలిన నీటితో సాగు కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ సారి యాసంగిలో ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని అందించలేమని అధికారులు స్పష్టం చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే తమకు కనీసం వారబందీ విధానంలోనైనా నీరందించాలని అధికారులను అన్నదాతలు వేడుకుంటున్నారు. యాసంగిలో పంట దిగుబడి సైతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈసారి యాసంగి పంటకు జూరాల ప్రాజెక్ట్ చరిత్రలో మరోసారి క్రాప్ హాలిడే ప్రకటన జారీ అయ్యింది. కృష్ణ బెసిన్ లో వర్షాభావ పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక బోర్లు, బావుల మీద అధారపడి కొంతమంది రైతులు కొంతమేర యాసంగి సాగుకు సిద్ధమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..