Telangana Congress – YSRTP: వైఎస్ షర్మిల, YSRTP అధ్యక్షురాలు.. తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటేందుకు వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈ తరుణంలో.. షర్మిల, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకేతో భేటీ అనంతరం.. కొన్నాళ్లుగా ఆమె కాంగ్రెస్‌లో చేరుతారంటూ రాజకీయ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు షర్మిల కొట్టిపడేస్తున్నప్పటికీ.. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం.. జరుగుతుందన్న వార్తలు మాత్రం ఆగడంలేదు. లేటెస్ట్‌గా షర్మిల అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలకు బలం చేకూర్చేలా కీలక కామెంట్స్ చేశారు టీకాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే. కాంగ్రెస్ అధిష్టానంతో వైఎస్ షర్మిల టచ్‌లో ఉన్నారని.. థాక్రే చేసిన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలాఉంటే.. మరోవైపు, బెంగళూరులో కర్నాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య షర్మిల అంశంపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. డీకేతో కోమటిరెడ్డి 40 నిమిషాలు సమావేశం కాగా.. ఈ సమయంలో ఎక్కువగా షర్మిల చేరికపైనే మాట్లాడుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ.. షర్మిలపై పార్టీ హైకమాండ్ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా డీకే చెప్పారని సమాచారం. అయితే, షర్మిల చేరిక విషయంలో తెలగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, ఎప్పటిలాగే షర్మిల వైపు నుంచి కామెంట్స్ వచ్చాయ్! అబ్బే అలాంటిదేమీ లేదంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు!. ఊహాజనిత ప్రచారాన్ని నమ్మొద్దంటూ మీడియాకి చెప్పారు షర్మిల. తనకు తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించి.. దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు షర్మిల.
పరిణామాలు చూస్తుంటే, షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనేలాగే కనిపిస్తున్నాయ్. ఇటీవల షర్మిల వేస్తోన్న స్టెప్స్ కూడా అందుకు బలం కలిగిస్తున్నాయంటూ పేర్కొంటున్నారు రాజకీయ ప్రముఖులు.. కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించాక డీకే శివకుమార్‌ను కలవడం, రీసెంట్‌గా రాహుల్‌గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పడం, భట్టికి ఫోన్‌చేసి పరామర్శించడం… ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌లో చేరడం ఖాయంలాగే అనిపిస్తోంది!. మరి, షర్మిల కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారా? YSRTPని మెర్జ్ చేస్తారా? ఈ ప్రశ్నలకు క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..