AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayanpet: విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?

విద్యార్థులకు విద్వాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారారు. అభం, శుభం తెలియని మైనర్ బాలిక జీవితంతో చెలగాటమాడారు. విద్యార్థిని లోబరుచుకొని ఒకరు, రహస్యంగా కెమెరా పెట్టి మరొకరు, వాటిని వైరల్ చేసిన ఇంకొకరు. ముగ్గురు ఉపాధ్యాయుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నేటి బాల బాలికలను భావితరాలకు ఆదర్శంగా నిలపాల్సిన గురువులు చీడపురుగులుగా మారారు.

Narayanpet: విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?
Minor Girl Abuse Case (Representative Image)
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 8:00 PM

Share

నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఓ గ్రామంలో గురువుల కీచక పర్వం పెను దుమారాన్ని రేపుతోంది. పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు ఓ విద్యార్థిని జీవతంతో చెలగాటమాడారు. పదోతరగతి చదువుతున్న సదరు విద్యార్థినికి మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు తెలుగు మాస్టారు స్వామి. పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఆ విద్యార్థినితో ఏకంగా పాఠశాలలోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఓ రహస్య సీసీ కెమెరా కంటికి చిక్కాడు. అయితే ఈ ఘటననే కిరాతకంగా ఉంటే… తెలుగు బోధించే ఉపాధ్యాయుడు స్వామితో విభేదాలు కలిగిన మరో ఉపాధ్యాయుడు మరో దారుణానికి ఒడిగట్టాడు. స్వామి మాస్టారుతో పదోతరగతి బాలిక సన్నిహితంగా ఉండడాన్ని గమనించాడు. ఎలాగైన ఈ విషయంలో తోటి ఉపాధ్యాయుడు స్వామిని ఇబ్బంది పెట్టాలని కంప్యూటర్ ల్యాబ్ లో రహస్యంగా సీసి కెమెరా అమర్చాడు మరో ఉపాధ్యాయుడు గుర్ నాథ్ రెడ్డి. అయితే ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం సదరు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సీసి కెమెరాలో రికార్డు అయ్యింది.

వీడియోలు పంపి బెదిరింపులు:

ఆ దృశ్యాలను గ్రామ సర్పంచ్ భర్త రవి కుమార్ తో పాటు ఆనంద్, విజయ్ కుమార్, రవి లకు ఏకంగా ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు పంపాడు. గ్రామస్థులు ఆ దృశ్యాలతో తెలుగు టీచర్ స్వామిని బెదిరించి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని బెదిరింపులకు గురిచేశారు. విషయం, వీడియోలు బయటకు పొక్కకుండా ఉండాలంటే తమకు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చివరకు 10లక్షలకు ఒప్పందం జరిగింది. డబ్బులు చెల్లించేందుకు స్వామి తో పేపర్ రాయించుకున్నారు. ఇక ఉపాధ్యాయుడు స్వామి సదరు బాలిక కుటుంబ సభ్యులతోను చర్చించి… వారిని కాంప్రమైజ్ చేసినట్లు మిగతా నిందితుల దృష్టికీ వచ్చింది. తమను కాదని బాలిక కుటుంబ సభ్యుల వద్దకు తెలుగు టీచర్ వెళ్లడంతో వీడియోలను గ్రామంలోని మరికొంత మందికి షేర్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకొని ప్రాథమిక విచారణ చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడైన తెలుగు ఉపాధ్యాయుడు స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో ఆదేశాలతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

విచారణలో సంచలనాలు:

ప్రధాన నిందితుడి విచారణలో సంచలన అంశాలు వెల్లడించాడు. అప్పటిదాక విద్యార్థినితో అనుచిత ప్రవర్తనే అనుకున్న పోలీసులకు షాక్ ఇచ్చాడు. పలుమార్లు బాలికను అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు తెలుగు మాస్టారు స్వామి. ఇక పాఠశాలలో రహస్యంగా సీసీ కెమెరా అమర్చడంతో పాటు, మైనర్ బాలిక వీడియోలు షేర్ చేసిన ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బాలిక వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసిన మిగతా నలుగురిని సైతం అదుపులోకి తీసుకొని మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించారు.

నారాయణపేట జిల్లాలో కీచకులుగా మారిన గురువుల వ్యవహారం రాష్ట్రంలోనే తీవ్ర దుమారం రేపింది. మైనర్ బాలిక జీవితంతో అడుకున్న నిందితులందరిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us