కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బీజేపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క సారలమ్మలనే మోసం చేశారు బీజేపీ నేతలు అంటూ ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం వాళ్లకు తేలిక అని విమర్శించారు. కవిత నోటీసులు వ్యవహారం డైలీ సీరియల్ లాగా.. సురభి నాటకం చూసినట్టుందని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరులో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా కిషన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఢిల్లీ రాజకీయం అంతా పొల్యూషన్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఫ్రెష్ పాలిటిక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. మతంతో రాజకీయం చేయాలని బీజేపీ చూస్తుంది. అలాంటి పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని కీలక ఆరోపణలు చేశారు. మోడీ పెట్టిన అన్ని బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు.
మోడీ.. కేసీఆర్ మధ్య రాజకీయ ప్రేమాయణం నడిచిందని ఆరోపించారు. లవర్స్ మధ్య ఏం చెడిపోయిందో కానీ.. రెండేళ్లు గ్యాప్ వచ్చినట్టు నటించారు అని ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి పెట్రోలు, డీజిల్ ధర పెంచింది మేమే అని చెప్పగలరా..? పోనీ గ్యాస్ ధర పెంచింది మీరే కదా..? అని నిలదీశారు. మీ తప్పులు కప్పి పుచ్చుకోవడం కోసం కాంగ్రెస్‌పై బీజేపీ నిందలు వేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుంటున్నారా లేదా..? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం సమ్మక్క సారాలమ్మ జాతరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా వెళ్లి జాతీయ జాతరగా ప్రకటిస్తాం అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మేడారం వెళ్లి.. జాతీయ పండుగగా చేస్తాం అని చెప్పలేదన్నారు. మేడారం జాతరకు నాలుగు రాష్ట్రాల ప్రజలు వస్తారు.. అందుకే జాతీయ పండగ డిమాండ్ ఉందన్నారు. అమ్మవారి గుడి ముందే ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు.. ఇంకేం కావాలి సాక్ష్యం అంటూ నిలదీశారు. పదేళ్ల నుండి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు బీజేపీ నేతలు అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. మూడు ఎంపీలు కూడా గెలవకపోతే ఇబ్బంది అవుతుందని అన్న భయం బీజేపీ నేతలకు పట్టుకుందని వ్యాఖ్యానించారు. బీజేపీ అబద్దాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..