Saraswati Pushkaralu: తెలంగాణకు పుష్కర శోభ.. సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం.. మే15 నుంచి..
సరస్పతీ నది పుష్కరాల కోసం తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తుల

భారతీయ సనాతన హైందవ సాంప్రదాయాలలో పుష్కర స్నానం ఒక అచంచలమైన గొప్ప భక్తి విశ్వాసం ఉన్నది. ప్రాణకోటి మనగడకు ఆధారమైన జలాన్ని ఆరాధించడం ఓ మోక్ష ప్రదాయమని శాస్త్రపరమైన నమ్మకం. అందుకే జీవరాశులన్నింటికీ జలం ప్రాముఖ్యత తెలపడానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. భారతదేశంలోని 12 నదుల్లోనూ గురుడు మేశం నుండి మీన రాశి వరకు పన్నెండు రాశులలో ఒక్కొక్క రాశి లోకి ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. గురుడు మిధున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. రెండు జీవనదులు కలిసిన చోట సరస్వతీ నది ఉద్భవించునని కాళేశ్వర ఖండములో స్పష్టం చేయబడింది. 15.05.2025 రోజున కాళేశ్వరంలో సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభం అవుతాయి. తేదీ 15.05.2025 నుండి 26.05.2025 వరకు సరస్వతీ నది పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.
సరస్వతి నది పుష్కర యాత్ర ఫలం
మాతృవంశం వారికి పిండ ప్రదానం చేయడం సరస్వతీ పుష్కరయాత్ర ఫలంగా చెబుతారు. అందుకే దాన్ని మాతృగయ అని కూడా అంటారు. సరస్వతీ నది అతి పురాతనమైనది. హిమాలయాల్లో పుట్టిన ఈ నది ప్రశస్తి ఋగ్వేదంలోనూ, భాగవతాధి పురాణాల్లోనూ, రామాయణ, మహాభారతంలోనూ కనిపిస్తుంది. బ్రహ్మ శిరస్సు నుండి ఉద్భవించినదిగా చెప్పుకునే ఈ సరస్వతీ నది కొంతదూరం ప్రవహించి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ లో అదృష్యమవుతుంది. గంగా, యమునా నదులతో అంతరవాహినిగా ప్రయాగ వద్ద కలిసి ప్రవహించడం వలన ప్రయాగను త్రివేణి సంగమం అని అంటారు. అలాగే గోదావరి, ప్రాణహిత నదులలో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తున్నందున కాళేశ్వరం కూడా త్రివేణి సంగమంగా ప్రఖ్యాతి చెందినది. అందువలన కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర సరస్వతీ పుష్కరస్నానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని నమ్ముతారు.
మానవులు తెలిసి తెలియక పుట్టినప్పటి నుండి చేసిన పాపాలు పుష్కర స్నానంతో తొలగిపోతాయని విశ్వాసం. ఈ నమ్మకంతోనే ఒక్కొక్క సంవత్సరం ఒక్కోనదికి వచ్చే పుష్కరాలకు వెళ్లి పుష్కర స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని హైందవ సాంప్రదాయం. భారతీయ సనాతన సాంప్రదాయాలలో పుష్కర స్నానం ఒక గొప్ప భక్తి భావం, కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కర స్నానం చేసిన పిదప శ్రీ మహా సరస్వతి అమ్మవారిని దర్శించుట వలన చాలా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహించు చున్నందున కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తున్నారు. మే 15 నుండి 26- వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్‌ను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ ఆవశక్యతని సూచిస్తూ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..
నదులను పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను (SUP) నిషేదించడం, బట్టలు ఉతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహణ నీటి కాలుష్యం నుండి చర్మ వ్యాధులను నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాహన కాలుష్యం మరియు రద్దీ తగ్గుతుందని తెలిపారు. మనం సమిష్టి బాధ్యత తీసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడానికి చేతులు కలపాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.
సరస్పతీ నది పుష్కరాల కోసం తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతన ఘాట్ నిర్మాణం, స్నానాల కొరకు షవర్లు ఏర్పాటు, టెంట్లు, చలువ పందిర్లు, లైటింగ్, ఓహోఆర్ వాటర్ ట్యాంకులు నిర్మించి త్రాగు నీటి ఏర్పాటు, అదనపు కౌంటర్లు నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, పిండ ప్రధాన మండపం, కేశఖండన మండపం నిర్మాణం, శాశ్వత మారుగుదొడ్లు, స్నానం గదుల నిర్మాణం, పుష్కర ఘాట్ పైన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం ఏర్పాటు, మేన్ ఘాట్ వద్ద స్వాగత తోరణం నిర్మాణం, హారతి ప్లాట్ ఫారం నిర్మాణం, గోదావరి నదిలో నీటివరకు తాత్కాలిక రోడ్డు ఏర్పాట్లతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దేవాలయం వద్ద ప్రత్యెక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు ఏర్పాట్లు చేశారు. అలాగే త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే పన్నెండు రోజులు సరస్వతి ఘాట్ పైన ప్రత్యేక హారతి కార్యక్రమం జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








