Telangana: ప్రమాదంలో గాయపడ్డ కొండముచ్చు.. సపర్యలు చేసిన ప్రతి ఒక్కరికి వేల వేల వందనాలు
ఈ రోజుల్లో మనుషులకు ప్రమాదం జరిగి చావుబ్రతుకుల్లో ఉంటేనే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకొందరు అయితే తీరిగ్గా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ కొండముచ్చుకు సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు కొందరు వ్యక్తులు. వివరాలు ఇలా ఉన్నాయి..

ఇలాంటివి చూసినప్పుడే మనుషుల్లో కాస్తయినా మానవత్వం బతికే ఉందని అనిపిస్తుంది. ఎంతసేపు మన గురించి తప్ప పక్కవాడి బాధ పట్టని మనకు.. మూగజీవుల పట్ల దయ, కనికరం చూపించడం చాలా గొప్ప విషయమే. ఆపదలో ఉన్నవాళ్లకు చేతనైన సాయం చేసేవాళ్లు నిజంగా మనుషుల్లో దేవుడు అనే చెప్పాలి. అలాంటిదే ఈ సంఘటన కూడా.. కానీ, ఇక్కడ ఆపదలో ఉన్నది మనిషి కాదు.. ఓ కొండముచ్చు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండముచ్చుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆ కొండముచ్చు గాయాలకు చికిత్స చేశారు. మంచినీళ్ళు తాగించారు. తన పరిస్థితికి సాయం చేస్తున్న జనాల పట్ల ఆ కొండముచ్చు దీనంగా చూడడం అక్కడివారిని కదిలించింది. కొండముచ్చుకు అయిన గాయాలకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం స్థానికులు ఆ మూగజీవిని ఆసుపత్రికి తరలించారు.
మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు కరువవుతున్న నేటి రోజుల్లో ఇలా ఓ మూగజీవికి సాయం అందించడం చాలా గొప్ప విషయం. సమయానికి కొండముచ్చుకి సపర్యలు చేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన స్థానికులు, వాహనదారులను పలువురు మెచ్చుకుంటున్నారు.
వీడియో దిగువన చూడండి…
