Hyderabad Old City Tension: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. వివాదస్పద వ్యాఖ్యల కేసులో రాజాసింగ్‌కు బెయిల్ వచ్చిన తర్వాత పాతబస్తీ అంతటా ఆందోళనలు చెలరేగాయి. దీంతోపాటు పలు పోలీస్‌స్టేషన్ల ఎదుట రాజా సింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటూ కొందరు బైఠాయింపులు కూడా నిర్వహించారు. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలంటూ కొందరు యువకులు బైకులపై ప్రదర్శన నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు శాలిబండ, మొఘల్‌పురాలోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి మొదలైన నిరసనలు ఉదయం కూడా కొనసాగాయి. చుడీ బజార్ ప్రాంతంలో దుకాణాలు మూసి వేసి, రోడ్లపై నల్లజెండాలతో నిరసన తెలిపారు. శాలిబండలో రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ యువకులు ఆందోళన చేపట్టారు. పలు చోట్ల పోలీసు వాహనాలపై దాడి చేయడంతో పలు వెహికల్స్ ధ్వంసమయ్యాయి. వివిధ ప్రాంతాల రాళ్ల దాడులో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు గోషామహల్ వెళ్లే ప్రధాన రహదారులన్నింటిని పోలీసులు పూర్తిగా మూసివేశారు. పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.
రాజా సింగ్ మొదటి నుంచి కాంట్రావర్సీ నేత ఉన్నారు. హిందూ వాహిని సభ్యుడిగా మొదలైన రాజాసింగ్ ప్రస్థానం.. గో సంరక్షణ, శ్రీరామ నవమి శోభాయాత్రల నిర్వహణతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కార్పొరేటర్‌గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్.. తన కామెంట్స్‌తో తరచూ వివాదాస్పదం అవుతుంటారు. మరోవైపు రాజాసింగ్‌ను రెండేళ్ల క్రితం ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్ లేబుల్ చేసింది. ఫేస్‌బుక్ ఫ్లాట్ ఫారం నుంచి తొలగించింది.
రాజాసింగ్‌పై ఇప్పటివరకు మొత్తం 42 కేసులు అయ్యాయి. ఇందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించినవి ఎక్కువ. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటకలోనూ కేసులు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టులు 36 కేసులు కొట్టివేశాయని రాజాసింగ్ తరపు న్యాయవాది చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..