
ఇటు మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు..! అటు బకాయిలు చెల్లించేదాకా అస్సల్ తగ్గేదేలే అంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిరసనకు దిగారు..! మరోవైపు నేనున్నాను ఇరువర్గాల మధ్య చర్చలు జరపుతానని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇన్నేసి వేరియేషన్లు ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ఇష్యూలో నెక్ట్స్ ఏం జరగబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రభుత్వంతో కాలేజీలు చర్చలు జరపడం.. ఆ చర్చలు ఫలించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటా సెటిల్మెంట్ ఫార్ములా…? ఆందోళనలకు ఎండ్‌కార్డ్ పడటానికి కారణాలేంటి…?
ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల పట్ల ప్రైవేట్ కళాశాలలు సానుకూలంగా స్పందించడంతో శనివారం (నవంబర్ 8) నుంచి కాలేజీ గేట్లు ఓపెన్ కాబోతున్నాయి. కాలేజీలు అడిగిన రూ. 1,500 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని.. మరో రూ. 600 కోట్లు వెంటనే రిలీజ్ చేస్తామని, మిగిలిన రూ. 300 కోట్లునూ త్వరలో క్లియర్ చేస్తామని భట్టీ హామీ ఇవ్వడంతో కాలేజీలు తెరుచుకోనున్నాయి.
ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్యాల చర్చలకు ముందు పెద్ద హైడ్రామా నడిచింది. ఐదు రోజులుగా నడుస్తున్న ఆందోళనలపై సీఎం రేవంత్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తామని వార్నింగిచ్చారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని.. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది ప్రసక్తేలేదంటూ మండిపడ్డారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య.. ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. కాలేజీల బంద్‌కు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలేదని… దశలవారీగా ఇస్తామంటే కాలేజీలను ఒప్పిస్తానన్నారు కృష్ణయ్య.
ఇటు కాలేజీలు కూడా తగ్గేదేలే అన్నట్లు ఐదోరోజు ఆందోళనలను ఉధృతం చేశాయి. తక్షణమే 50 శాతం బకాయిలు చెల్లించేదాకా ఆందోళనలను విరిమించే ప్రసక్తేలేదంటూ ప్రభుత్వతీరుపై మండిపడ్డాయి. ఇలా ఓవైపు సీఎం సీరియస్ కామెంట్స్.. మరోవైపు కాలేజీల ఆందోళనలు.. ఇంకోవైపు మంతనాలు జరుపుతానన్న కృష్ణయ్య.. ఇలా ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ప్రభుత్వం-కాలేజీ యాజమాన్యాల మధ్య చర్చలు జరగడం.. ఆ చర్చలు ఫలించడం ఆల్ ఆఫ్ సడెన్‌గా జరిగిపోయాయి. 15వందల కోట్లలో 900 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాజీ కుదిరింది. ఫలితంగా శనివారం నుంచి కాలేజీలు తెరుచుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..