నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సంవత్సరంలో ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఎనిమిదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు ఫైనల్ దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బీహార్ కు చెందిన సుపారి కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. సుభాష్ శర్మకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టుకు వివరించడంతో.. కొంతకాలంగా బెయిల్ నిరాకరిస్తున్నారు. కాగా 2024 నవంబర్ లో బెయిల్ మంజూరు చేయాలని సుభాష్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షూరిటీలను సమర్పించి జిల్లా కోర్టులో బెయిల్ పొందాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సుభాష్ శర్మకు షూరిటీ ఇచ్చేందుకు ముగ్గురు ముందుకు వచ్చారు. కేతపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు, మాడుగుల పల్లి మండలం పాములపాడుకు చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కామల మల్లేష్ లు ఫోర్జరీ షూరిటీ పత్రాలను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ షూరిటీ పత్రాలపై అనుమానం వచ్చిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు షూరిటీ పత్రాలపై విచారణ చేపట్టారు. సుభాష్ శర్మ బెయిల్ కోసం కోర్టుకు సమర్పించిన షూరిటీ పత్రాలు నకిలీ పత్రాలుగా పోలీసులు గుర్తించారు. కోర్టును మోసం చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పోత్రాలను సృష్టించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.
కాగా నకిలీ షూరిటీ పత్రాలలో ప్రధాన నిందితుడు వంగాల సైదులుపై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు నమోదు అయినట్లు ఆయన చెప్పారు. మిగిలిన ఇద్దరు కూడా నేర చరిత్రను కలిగిన వారు కావడంతో..పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కోర్టుకు అందజేయనున్నట్లు డిఎస్పి తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..