
జనాభా నియంత్రణ విషయంలో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో టోటల్ ఫర్టిలిటీ రేటు (TFR) 1.8గా నమోదైంది. అంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఇద్దరు పిల్లల కంటే తక్కువ మందికే జన్మనిస్తున్నట్టు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ సగటు ఫర్టిలిటీ రేటు 2.0గా ఉండగా, తెలంగాణ దానికంటే మెరుగైన స్థాయిలో నిలిచింది. సాధారణంగా జనాభా స్థిరంగా ఉండాలంటే రిప్లేస్‌మెంట్ లెవల్ 2.1గా ఉండాలి. కానీ తెలంగాణలో ఇది 1.8కి తగ్గడం ద్వారా జనాభా పెరుగుదల స్పష్టంగా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
కుటుంబ నియంత్రణపై ప్రజల్లో పెరిగిన అవగాహన, చిన్న కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలే ఈ ఫలితాలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమవాలన్న నిర్ణయానికి మెజారిటీ దంపతులు వస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఫర్టిలిటీ రేటు పరంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ (1.7), తమిళనాడు (1.8), కర్ణాటక (1.7), కేరళ (1.8) కూడా రిప్లేస్‌మెంట్ లెవల్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ విధానాలు ఎంత ప్రభావవంతంగా అమలవుతున్నాయో సూచిస్తోంది.
ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బిహార్‌లో ఫర్టిలిటీ రేటు 3.0గా ఉండగా, మేఘాలయలో 2.9, ఉత్తరప్రదేశ్‌లో 2.4, జార్ఖండ్‌లో 2.3గా నమోదైంది. ఈ లెక్కలు ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి.
దేశంలో అత్యల్ప ఫర్టిలిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో సిక్కిం (1.1), అండమాన్ నికోబార్, గోవా, లడఖ్ (1.3) ఉన్నాయి. గతంలో ఎన్ఎఫ్‌హెచ్ఎస్–4లో దేశ సగటు ఫర్టిలిటీ రేటు 2.2గా ఉండగా, తాజా ఎన్ఎఫ్‌హెచ్ఎస్–5లో అది 2.0కి తగ్గిందని కేంద్ర మంత్రి తెలిపారు.
జాతీయ జనాభా విధానం లక్ష్యాలకు అనుగుణంగానే ఈ తగ్గుదల ఉందని కేంద్రం స్పష్టం చేసింది. తల్లి–బిడ్డల ఆరోగ్యంపై ప్రభుత్వాల దృష్టి, కుటుంబ నియంత్రణ సేవల విస్తరణ, ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే ఈ సానుకూల మార్పు సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..