తీగ లాగితే డొంక కదిలినట్లు.. మొబైల్ స్నాచింగ్ కేసును చేధించే క్రమంలో అంతర్జాతీయ మొబైల్ ఫోన్ల స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్లను స్నాచింగ్ చేసి వాటిని సూడాన్కు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ ముఠా నుండి పదుల సంఖ్యలో కాదు ఏకంగా ఏడు వందల స్మార్ట్‌ఫోన్లను రికవరీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో గత కొద్ది రోజులుగా సెల్ ఫోన్ల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. అది కూడా రాత్రి వేళలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకొని స్నాచింగ్‌లు జరుగుతుండటంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం బండ్లగూడలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరి నుండి సెల్‌ఫోన్ స్నాచింగ్ చేసింది ముఠా. అక్కడి నుండి కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమరా విజువల్స్‌లో ఓ బైక్ ను గుర్తించారు. ఆ బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ బైక్ కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీ కేసు ఉన్నట్లు గుర్తించారు. చోరీ చేసిన బైక్‌ల మీద వచ్చి సెల్ ఫిన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఐతే సెల్‌ఫోన్ స్నాచింగ్‌లను నిర్మానుష్య ప్రదేశాలలో ఒంటరిగా వెళ్తున్న వారిని గుర్తించి వారితో మాటలు కలిపి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. చివరకు సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను పట్టుకున్నారు. విచారణలో ముఠా సభ్యులు చెప్పిన వివరాలతో ఖంగుతిన్నారు పోలీసులు. సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠా సంబంధాలు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 17 మంది సభ్యులు గల ఈ ముఠాలో 12 మంది హైదరాబాద్‌కు చెందిన వారు ఉండగా మరో ఐదుగురు సూడాన్ దేశస్తులుగా గుర్తించారు. ఇక్కడ సెల్‌ఫోన్‌లను స్నాచింగ్ చేసి సూడాన్కు తరలిస్తున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యారు. సూడాన్ దేశస్తుల్లో అల్‌దాబ్వీ ప్రధాన నాయకుడని గుర్తించారు. ఇతనికి మరో నలుగురు సూడాన్ దేశస్తులు సహకరిస్తున్నట్లు గుర్తించి, మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అల్‌దాబ్వి స్నాచింగ్ చేసిన ఫోన్లను సీ ఫుడ్ ముసుగులో థర్మల్ బాక్సులలో ప్యాక్ చేసి పంపిస్తున్నట్లు విచారణలో తెలిపాడు. ఆ దేశానికి వెళ్ళిన సెల్‌ఫోన్‌లను సాఫ్ట్వేర్ సహాయంతో అన్‌లాక్ చేసి విక్రయిస్తున్నారు.
నగరంలో జగదీష్ మార్కెట్లో స్నాచింగ్ చేసిన సెల్‌ఫోన్‌లను ఎలమందరెడ్డికి విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు. సెల్‌ఫోన్‌లోని విడిభాగాలను తీసీ ఒరిజినల్ పార్ట్స్ గా విక్రయిస్తున్నాడు ఎలమందరెడ్డి. దీంతో జగదీష్ మార్కెట్‌పై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు సీపీ తెలిపారు. స్నాచింగ్, చోరీ చేసిన సెల్ ఫోన్ లను కొనుగోలుకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిందని, ఇలాంటి షాప్‌లను గుర్తించి సీజ్ చేస్తామని సీపి చెబుతున్నారు. కాగా, ఈ ముఠా రోడ్లపై అల్లరి చిల్లరగా తినే యువతకు జీతాలు ఇచ్చి సెల్‌ఫోన్‌లను స్నాచింగ్ చేపిస్తున్నట్లు గుర్తించారు. నిర్మానుష్య ప్రదేశాలలో అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుద్దని ఎవరైనా వెంటపెట్టుకొని అత్యవసరమైతే బయటికి రావాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.