సమాధిలో దాగిన రహస్యం.. 72 రోజుల తర్వాత యువకుడి మృతదేహం వెలికితీసిన పోలీసులు
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి అనుమానాస్పద మృతి కేసు మళ్లీ తెరపైకి రావడంతో పెను దుమారాన్ని సృష్టిస్తుంది. తన కుమారుడి మరణం వెనుక కుట్ర ఉండవచ్చని ఆరోపిస్తూ మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మొదటికి వచ్చింది. సుమారు 72 రోజుల క్రితం మరణించిన కారు డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు తాజాగా వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

పాతబస్తీ జమాల్ కాలనీకి చెందిన 27 ఏళ్ల సైఫ్ ఉల్లా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చి 31న ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అప్పట్లో ఇది సహజ మరణంగా భావించినప్పటికీ, సైఫ్ ఉల్లా తల్లి తన కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కుట్ర ఉండవచ్చని ఆరోపిస్తూ సల్మాన్, అతని సోదరుడు అజీజ్, ఫుజైల్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి ఫోన్ కాల్ రికార్డులు, మెసేజ్‌లు, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు కేసును మళ్లీ పరిశీలించడం ప్రారంభించారు. విచారణలో భాగంగా MRO, వైద్య బృందం, ఏసీపీ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్, ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, క్లూస్ టీమ్ సమక్షంలో సైఫ్ ఉల్లా మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రస్తుతం పోలీసులు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
అదే సమయంలో మృతుడి మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ సందేశాలు, సీసీటీవీ ఫుటేజ్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే సైఫ్ ఉల్లా మరణం సహజ కారణాలతో జరిగిందా, లేక హత్య జరిగిందా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, కేసులో నిజానిజాలు వెలుగులోకి తీసుకురావడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..