YS Sharmila: పాదయాత్రపై సందిగ్ధం.. అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని షోకాజ్ నోటీసులు..

|

Dec 04, 2022 | 8:15 AM

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర పునః ప్రారంభిస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించగా.. పోలీసుల నుంచి...

YS Sharmila: పాదయాత్రపై సందిగ్ధం.. అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని షోకాజ్ నోటీసులు..
Ys.sharmila
Follow us on

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర పునః ప్రారంభిస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించగా.. పోలీసుల నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వైస్ఎస్ షర్మిల పాదయాత్రపై షోకాజ్ నోటిసులు అందజేసిన పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల అనుమతి కోసం షర్మిల చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వల్లనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు ఆధారాలు చూపించారు. ప్రస్తుతం పాదయాత్ర అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని పోలీసులు కోరారు. అయితే కోర్టు ద్వారా పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వైఎస్సార్టీపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. షర్మిల ఇచ్చే వివరణపై పోలీసులు సంతృప్తి చెందితేనే పాదయాత్రకు అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. వైఎస్.షర్మిల వరంగల్ జిల్లా పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ధ్వంసమైన కారులోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను మార్గమధ్యంలో అడ్డుకున్నారు. కారు దిగాలని కోరినా.. ఆమె దిగకపోవడంతో క్రేన్ సహాయంతో కారును ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం తీవ్ర నాటకీయ పరిస్థితుల నడుమ ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ ఘటనపై వైఎస్.విజయమ్మ స్పందించారు. నిరసన తెలిపితే అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇన్సిడెంట్ పై వైఎస్ షర్మిల రెస్పాండ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రను టీఆర్‌ఎస్‌ గూండాలు అడ్డుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని మండిపడ్డారు. తన పాదయాత్రను, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని తేల్చి చెప్పారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ వారు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..