సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై మహిళా అధ్యాపకుల ఫిర్యాదు.. రంగంలోకి పోలీసులు
జేఎన్‌టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ టీ కిరణ్ కుమార్ రెడ్డిపై విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీజేఐటీ)కి చెందిన మహిళా అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సదస్సుకు ఆహ్వానించేందుకు వెళ్లిన తమ పట్ల వీసీ అనుచితంగా ప్రవర్తించారని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తన టేబుల్‌పై ఉన్న సుత్తిని తీసుకుని తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీజేఐటీ ప్రిన్సిపాల్ ఏ సృజన, సీఎస్‌ఈ విభాగాధిపతి డీ అరుణ కుమారి ఈ నెల 6న జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 30న తమ కళాశాలలో నిర్వహించనున్న ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్ కమ్యూనికేషన్ సదస్సుకు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముందస్తు అనుమతితో వెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం వీసీ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని అధ్యాపకులు ఆరోపించారు. మహిళలపై వివక్ష చూపేలా మాట్లాడటంతో పాటు అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
మహిళలు ఇంటికే పరిమితమై వంటగది, పిల్లల బాధ్యతలు చూసుకోవాలన్న రీతిలో వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. అక్కడి చెత్తబుట్టను చూపిస్తూ తమను కించపరిచారని తెలిపారు. తాము దీనిపై అభ్యంతరం చెప్పేందుకు ప్రయత్నించగా వీసీ గెట్‌ఔట్ అంటూ గట్టిగా అరిచారని అధ్యాపకులు పేర్కొన్నారు. ఆ తర్వాత టేబుల్‌పై ఉన్న సుత్తిని చేతిలోకి తీసుకుని తమ వైపు రావడంతో భయాందోళనకు గురయ్యామని ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఘటనలో అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమను కూడా వీసీ అసభ్యకర పదజాలంతో దూషించారని వారు పేర్కొన్నారు. తమతో అమర్యాదగా వ్యవహరించడంతో పాటు తన ఎదుట కూర్చునే అర్హత కూడా లేదన్నట్లుగా మాట్లాడారని ఆరోపించారు. మహిళా అధ్యాపకుల ఫిర్యాదును కేపీహెచ్‌బీ పోలీసులు స్వీకరించి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాలు, ఆరోపణలపై దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా, మహిళా అధ్యాపకులు చేసిన ఆరోపణలపై జేఎన్‌టీయూహెచ్ వీసీ కిరణ్ కుమార్ రెడ్డి నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. పోలీసుల విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
