48 ఏళ్లుగా మంచి నీళ్లే తాగని బిలియనీర్ వారెన్ బఫెట్!
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని చెబుతారు. కానీ ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బిలియనీర్ వారెన్ బఫెట్ ఇందుకు పూర్తి భిన్నం. గత 48 ఏళ్లుగా కనీసం ఒక్క గ్లాసు నీళ్లు కూడా తాగలేదని చెబుతున్నారు. నీళ్లకు బదులుగా తనకు ఇష్టమైన చెర్రీ కోక్ తాగుతారట. రోజుకు ఐదు క్యాన్ల వరకు కోక్ తాగే ఈ 96 ఏళ్ల బిలియనీర్ ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి.

48 ఏళ్లుగా నీళ్లకు దూరం!
వారెన్ బఫెట్ నీళ్లు తాగరనే విషయాన్ని ప్రముఖ బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్ ఇటీవల వెల్లడించారు. ‘ఈక్విటీ మేట్స్ ఇన్వెస్టింగ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన బఫెట్‌తో కలిసి ఓ విందులో పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో బఫెట్‌ను మీరు సాధారణ నీళ్లు తాగుతారా? లేదా సోడా కలిపిన నీళ్లు కావాలా? అని అడిగారట. అందుకు బఫెట్ రెండింటినీ తిరస్కరించి తనకు సోడా కావాలని చెప్పారట. అప్పుడు మీరు నీళ్లు తాగరా? అని అక్మాన్ అడగ్గా గత 48 ఏళ్లుగా నీళ్లు తాగడం లేదని బఫెట్ సమాధానం ఇచ్చారట. బఫెట్ తన ఇంటికి విందుకు వచ్చినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా చెర్రీ కోక్ బాటిళ్లను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచినట్లు అక్మాన్ గుర్తుచేసుకున్నారు.
50 ఏళ్ల పాటు పెప్సీ.. ఆ తర్వాత చెర్రీ కోక్!
బఫెట్ తన కోక్ అలవాటు గురించి 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకు 2,700 కేలరీల ఆహారం తీసుకుంటే అందులో నాలుగో వంతు కోకాకోలా నుంచే వస్తుందనీ రోజుకు కనీసం ఐదు 12 ఔన్సుల కోక్ సర్వింగ్స్ తాగుతానని వెల్లడించారు. బఫెట్‌కు కోక్ కంటే ముందు పెప్సీ అంటే ఇష్టం. దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన పెప్సీ తాగారు. చిన్నతనంలో ఆయనను స్నేహితులు ‘పెప్సీ వారెన్’ అని పిలిచేవారట.
ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం!
బఫెట్ తన ఆహారపు అలవాట్లను ఆరేళ్ల పిల్లాడి ఆహారంతో పోల్చుతుంటారు. ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో అధిక చక్కెర అధిక ఉప్పు ఉన్న సాసేజ్, ఎగ్ బిస్కెట్లు, హాంబర్గర్లు, హాట్ డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్ సండేలు, క్యాండీస్ చాక్లెట్లు, మెక్‌డొనాల్డ్స్‌లో అల్పాహారం వంటివి ఉన్నాయి. అయితే సంతోషంగా ఒత్తిడి లేని జీవితం గడపడం తన దీర్ఘాయుష్షుకు కారణమని బఫెట్ నమ్ముతారు.
ఆరోగ్యానికి ఇది మంచి అలవాటా?
ఇలాంటి ఆహారపు అలవాట్లతో వారెన్ బఫెట్ 96 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అధిక చక్కెర ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం, ఎక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫాట్స్ వల్ల ఊబకాయం, టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. వారెన్ బఫెట్ ఆహారపు అలవాట్లు ఆయన వ్యక్తిగత జీవనశైలికి సంబంధించినవి మాత్రమే. నీళ్లకు బదులుగా కోక్ తాగడం ఆరోగ్యకరం కాదు. శరీరానికి అవసరమైన నీటిని తగినంతగా తీసుకోవడం చాలా ముఖ్యం.