Amit Shah: తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ కోసమే.. అమిత్ షా ఫైర్
ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదు.. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ జేబుల్లోకి వెళ్లే ట్యాక్స్.. అంటూ హైదరాబాద్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఒక ఏటీఎంలా మార్చేశారని నిప్పులు చెరిగిన ఆయన.. ఈవీఎంలు, ఎస్ఐఆర్, చొరబాటుదారుల అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ భాగ్యనగరం నడిబొడ్డు నుంచి రాహుల్ గాంధీకి నేరుగా సవాల్ విసిరారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దర్బార్‌కు, ఆ పార్టీ అధిష్టానానికి ఏటీఎంగా మార్చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదని, అది రేవంత్ రెడ్డి ద్వారా నేరుగా రాహుల్ గాంధీకి చేరుతున్న ట్యాక్స్ అని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సంపదను ఢిల్లీ పరం చేస్తున్న కాంగ్రెస్ తీరును ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా మొజంజాహి మార్కెట్ వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తోంది?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దోపిడీ పెరిగిపోయిందని అమిత్ షా ధ్వజమెత్తారు. ‘‘ఇక్కడి ఆర్ఆర్ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? రాహుల్ కోసమే ఇక్కడ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ అవినీతిని అసదుద్దీన్ ఒవైసీ ఆపగలరా? లేక బీఆర్ఎస్ ఆపుతుందా? కాంగ్రెస్ అవినీతిని అడ్డుకునే సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది’’ అని అమిత్ షా స్పష్టం చేశారు. పేదలు, రైతులు, నిరుద్యోగ యువత పక్షాన బీజేపీ నిరంతరం పోరాడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలంతా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే దేశాన్ని త్వరలోనే డ్రగ్స్ రహిత భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని, కీలక సమయాల్లో బాధ్యత విస్మరించి మాటిమాటికీ విదేశాలకు పారిపోయే నేతలు మనకు అవసరమా అని ఆయన పరోక్షంగా రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు.
చర్చకు సిద్ధమా? రాహుల్‌కు హైదరాబాద్ గడ్డ నుంచి సవాల్
పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని కేంద్ర హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాహుల్ జీ.. మీరు పార్లమెంటును నడవనీయరు. ఈవీఎం, ఓటర్ల సవరణ ప్రక్రియ, దేశంలోకి అక్రమ చొరబాటుదారుల అంశాలపై హైదరాబాద్ గడ్డ నుంచి నేను మీకు నేరుగా సవాల్ విసురుతున్నా. ఈ అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధం.. చర్చకు మీరు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముఖాముఖి చర్చకు ముందుకు రాదని, పార్లమెంటులో చర్చ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అసలు బండారాన్ని బట్టబయలు చేస్తారన్న భయం ఆ పార్టీకి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన చర్చల ద్వారా కాకుండా, పార్లమెంటులో అరాచకం సృష్టించి కేవలం వార్తల్లో నిలవడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండాగా మారిందని అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
