Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటలపాటు నీటి సరఫరా బంద్..
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో వరుసగా 36 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. గండిపేట నుంచి నీటిని తరలించే వందేళ్ల నాటి పురాతన పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీల మరమ్మతుల కారణంగా నవంబర్ 3 ఉదయం నుంచి ఈ అంతరాయం ఏర్పడనుండటంతో ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది. ఏ ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ ఉంటుందో తెలుసుకోండి..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నవంబర్ 3న తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలగనుంది. గండిపేట నుంచి నగరానికి తాగునీరు అందించే వందేళ్ల పురాతన రాతి నిర్మాణ కాండ్యూట్‌కు ఏర్పడిన లీకేజీలను అరికట్టేందుకు జలమండలి అత్యవసర మరమ్మతు పనులు చేపట్టింది. ఈ కారణంగా నవంబర్ 3 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు జలమండలి కృష్ణా, గోదావరి, సింగూరు-మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తదితర జలవనరుల ద్వారా ప్రతిరోజూ దాదాపు 560 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. ఇందులో గండిపేట నుంచి సరఫరా చేసే 20 ఎంజీడీల సామర్థ్యం గల పురాతన రాతి కాండ్యూట్‌పై సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ పరిసరాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. నీటి వృథాను అరికట్టి, వ్యవస్థను పటిష్టం చేసేందుకు 36 గంటల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతులను పూర్తి చేయనున్నారు. ఈ అంతరాయం కేవలం గండిపేట పైప్‌లైన్‌పై ఆధారపడిన నిర్దిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, కృష్ణా, గోదావరి, మంజీరా తదితర ఇతర జలవనరుల ద్వారా నగరవ్యాప్తంగా సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జలమండలి స్పష్టం చేసింది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే:
గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13): రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే పరిసరాలు, గన్‌ఫౌండ్రీ.
గోల్కొండ జోన్ (డివిజన్-14): చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్.
కవాడిగూడ సర్కిల్ (డివిజన్-17): కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ తదితర పరిసరాలు.
జూబ్లీహిల్స్ సర్కిల్ (డివిజన్-15): బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాలు.
మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగినంత తాగునీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.
