ఖరీదైన మద్యం, కేజీ బంగారం, కోట్లలో భూములు! సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ ఇంట్లో ఏసీబీ వేట!
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ SP నాయినీ భుజంగరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం (జూన్ 03) మెరుపు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో ఏసీబీ చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో భుజంగరావుకు సంబంధించిన భారీ అక్రమ ఆస్తుల చిట్టా వెలుగుచూసింది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ SP నాయినీ భుజంగరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం (జూన్ 03) మెరుపు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో ఏసీబీ చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో భుజంగరావుకు సంబంధించిన భారీ అక్రమ ఆస్తుల చిట్టా వెలుగుచూసింది.
భుజంగరావు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సోదాలలో లభించిన ఆస్తుల వివరాలను వివరించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 27.29 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇళ్లు, ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంట్లో కేజీ బంగారు నగలు, రూ. 3.8 లక్షల నగదు, రూ. 8 లక్షల బ్యాంక్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ఖరీదైన కార్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
ఈ ఆస్తుల ప్రభుత్వ అధికారిక విలువ రూ. 5 కోట్ల 92 లక్షలుగా తేల్చారు. అయితే, ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే వీటి విలువ పది రెట్లకు పైగా, అంటే దాదాపు రూ. 60 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆయన ఇంట్లో 29 ఖరీదైన మద్యం సీసాలను కూడా గుర్తించి ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించారు. ఈ క్రమంలో భుజంగరావును అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి ఏసీబీ ఆఫీసుకు తరలించారు. ఆయన బినామీలపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో రిటైర్మెంట్ కాబోతుండగా భుజంగరావు ఏసీబీకి దొరకడం గమనార్హం.
స్పీడందుకున్న సిట్ విచారణ
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా బడంగ్‌పేట మాజీ మేయర్ పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో తాము రాజకీయంగా ఎదుగుతుండటాన్ని ఓర్వలేకే గత ప్రభుత్వ పెద్దలు తమ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని పారిజాత ఆరోపించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన నర్సింహారెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో సాక్షిగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఒకవైపు ఏసీబీ అక్రమాస్తుల తనిఖీలు, మరోవైపు సిట్ వేగవంతమైన విచారణలతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయ, పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
