AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు..!

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల విస్తరణకు శ్రీకారం చుడుతోంది. తొలి దశలో సుమారు 2.50 లక్షల మంది కొత్త అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఈసారి వృద్ధులు, వితంతువులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులకు కూడా పింఛన్లు పొడిగించే ప్రతిపాదన ఉంది. పారదర్శకత కోసం..

స్వాతంత్ర్య దినోత్సవ కానుక.. 2.50 లక్షల మంది అకౌంట్‌లోకి డబ్బులు..!
Telangana New PensionsImage Credit source: tv9 telugu
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 10:01 AM

Share

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పథకాల విస్తరణకు సిద్ధమవుతోంది. అర్హులైన పేద కుటుంబాలకు చేయూత అందించే లక్ష్యంతో తొలి దశలో సుమారు 2.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసే దిశగా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. అదే రోజు జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రులు కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈసారి పింఛన్ల పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులతో పాటు తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా బాధితులను కూడా కొత్తగా చేయూత పథకంలో చేర్చే ప్రతిపాదన ఉంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.

కొత్త పింఛన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

రాష్ట్రంలో గతంలో సుమారు 42 లక్షల పింఛన్లు అమల్లో ఉండగా, అర్హతల పరిశీలన తర్వాత ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు కొత్తగా మరో 2.50 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా అర్హులైన మరిన్ని కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

కొత్త పింఛన్ల ఎంపికలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-కేవైసీతో పాటు లైవ్‌నెస్ అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టింది. లబ్ధిదారులు నిజంగా ఉన్నారా, అర్హులేనా అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది జాబితా సిద్ధమయ్యే అవకాశం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో లైవ్‌నెస్ అథెంటికేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు జిల్లాలు ఈ ప్రక్రియను పూర్తిచేయగా, పంచాయతీ కార్యదర్శులు, సెర్ప్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేపట్టినట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి.

అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఈ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదు. వేల సంఖ్యలో కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నివాస మార్పులు, అద్దె ఇళ్లలో నివాసం, సిబ్బంది కొరత వంటి కారణాలతో జాప్యం ఏర్పడినట్లు చెబుతున్నప్పటికీ, పెండింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

లైవ్‌నెస్ అథెంటికేషన్‌కు ప్రభుత్వం ఆగస్టు 15ను చివరి తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తిచేసి అదే రోజు కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించనున్న అధికారిక మార్గదర్శకాల తర్వాత జిల్లాల వారీగా అమలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us