
ఒక మహాయజ్ఞం ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాద్భుతాన్ని ఈ తరం చూడగలిగింది. పుణ్యస్నానాలు చేసి తరించింది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాతో.. త్రివేణి సంగమం పులకించింది. ఇసుకేస్తే రాలనంత జనం.. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమంతో నెలన్నరపాటు.. కన్నుల పండువగా సాగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26తో ముగిసింది. ఈ 45 రోజులపాటు.. దారులన్నీ ప్రయాగ్‌రాజ్‌వైపే అన్నట్లు సాగింది మహాకుంభమేళా. చిన్న, పెద్ద తేడా లేకుండా.. కోట్ల మంది ప్రజలు ప్రయాగ్‌రాజ్ బాట పట్టారు.45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాకు.. 66 కోట్ల మందికి పైగా హాజరయ్యారు. కొందరు వ్యయప్రసాలకోర్చి మరీ కుంభ్ చేరుకుని పవిత్ర స్నానమాచరించి.. తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాల వల్ల కుంభమేళాకు వెళ్లాలని మనసులో అనుకున్నప్పటికీ.. కొందరు వెళ్లలేకపోయారు..అలాంటి వారికి అక్కడి నుండి కుంభమేళా నీటిని తీసుకొని వచ్చి తమ ఊరి ప్రజలకు పంపిణీ చేశాడు ఓ వ్యక్తి. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన మహేష్ గుప్తా అనే వ్యక్తి కుంభమేళా నుండి తెచ్చిన గంగా జలాన్ని గ్రామంలోని ప్రతి ఇంటికి పంచాడు. వ్యాపారంలో రాణించిన కుటుంబంలో జన్మించిన పబ్బా మహేష్ గుప్తా ఆ మండల ప్రజలకు అనునిత్యం ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయాన్ని, పలు గ్రామాలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటాడు.. ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పబ్బా మహేష్ గుప్త ఆర్థిక సాయం అందుతుంది. తాజాగా తాను ఉంటున్న శివంపేట గ్రామంలో ఎంతోమంది కుంభమేళాకు వెళ్లలేకపోయారని గుర్తించి, కుంభమేళా జరిగిన ప్రాంతంలోని గంగా జలాన్ని తెప్పించి తన గ్రామంలోని గడపగడపకు చేరవేశాడు. ఇలా సుమారు 1500 లీటర్ల గంగా జలాన్ని క్యానుల్లో తెప్పించి, నీళ్ల బాటిళ్లలో నింపించి తన అనుచరులతో తన గ్రామంలోని ప్రతి గడపకు చేరవేసి గ్రామ ప్రజల మన్నలను పొందాడు.కుంభ మేళా వెళ్లలేదు అనుకుని బాధపడుతున్న గ్రామ ప్రజలు.. ఆ పవిత్ర జలం ఏకంగా తమ ఇంటికే రావడంతో సంబరపడిపోతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..