Telangana Govt Hospitals: ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అని అప్పట్లో సర్కారు ఆసుపత్రి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితిని ఓ సినీ కవి పాట రూపంలో చెప్పాడు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తే మాత్రం ఇప్పుడు ఆ పాటను తిరగరాయలేమో అనిపించక మానదు. గర్భిణుల చేరిక, ప్రసవాల విషయంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలించింది సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి.
సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రినే ఎంచుకుంటున్నారు. 2021 ఏప్రిల్ నుండి డిసెంబర్ నెలవరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవలతో పాటు ప్రసవం అనంతరం ప్రభుత్వం అందిస్తున్న నగదు సహాయం, కేసీఆర్ కిట్ వంటి అంశాలు ప్రభుత్వాస్పత్రుల్లో అధిక ప్రసవాలకు కారణం అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో జరిగిన మొత్తం ప్రసవాల్లో సుమారు 71 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యాయి. కేవలం 29 శాతం మంది మాత్రమే ప్రయివేటు ఆసుపత్రిని ఆశ్రయించడం గమనార్హం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన 71% ప్రసవాల్లో 67% సాధారణ కాన్పులు కావడం చెప్పుకోదగ్గ అంశం. ఇదే క్రమంలో ప్రయివేట్ ఆసుపత్రుల్లో జరిగిన 29% ప్రసవాలు అన్నీ సీజేరియన్లే కావడం గమనించదగ్గ పరిణామం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల విషయంలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలతో పోల్చితే సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రెండవ స్థానంలో నల్గొండ, మూడో స్థానంలో నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సాధారణ కాన్పులు 67 శాతంగా ఉంటే ఈ రెండు జిల్లాలో 45 శాతానికి మించలేదు.
సంగారెడ్డి జిల్లా ఈ ఘనత సాధించడానికి క్షేత్ర స్థాయిలో ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల కృషి చాలా ఉందనే చెప్పాలి. గర్భం దాల్చినప్పటి నుండి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అవసరమనే విషయాలపై గర్భిణులకు అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర వహిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే సౌకర్యాలు, ప్రసవం జరిగితే ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయలపై వీరికి చక్కని అవగాహన కల్పించడం ఈ ఘనతకు కారణంగా వైద్యాధికారులు చెబుతున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉన్నాయని గర్భిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని, ప్రసవం తర్వాత శిశువుల సంరక్షణ కూడా బాగుంటుందంటున్నారు. ఏ రాత్రి ఆసుపత్రికి వచ్చినా ఇక్కడ వైద్యం అందుతుందని చెబుతున్నారు ఆసుపత్రికి వచ్చే వారు. సర్కారు దవాఖాన అంటేనే భయపడి పారిపోయే పరిస్థితి నుండి ప్రభుత్వ దవాఖానకు పరుగెత్తే రోజులు రావడం నిజంగా సంతోషం. భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఇంకా మెరుగైతే ప్రయివేటు ఆసుపత్రులు మూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు.
Also read:
Mirnalini Ravi: తనదైన స్మైల్ , స్టైల్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్..
Diabetes: మధుమేహం ఉంటే పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటివి ఎంచుకోవాలి.. నిపుణులు ఏమంటున్నారంటే?
Anupama Parameswaran: హాట్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ‘అనుపమ పరమేశ్వరన్’ లేటెస్ట్ ఫొటోస్…