పవన్ వెళ్లి కలిసొచ్చి నెల కూడా కాలేదు.. ఇంతలోనే లోకాన్ని వీడిన చోటా గబ్బర్ సింగ్
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ ఇక లేడు. అరుదైన న్యూరోమస్క్యులర్ జన్యు వ్యాధితో పోరాడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అతడు బుధవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ..

ఒక అభిమానిని కలవడానికి స్టార్ హీరోగా కాదు.. ఆప్తుడిలా అతడి ఇంటి గుమ్మం దాటారు పవన్ కళ్యాణ్. మంచానికే పరిమితమైన ఆ బాలుడి చేతిని పట్టుకుని ధైర్యం చెప్పారు. “మనిద్దరం కలిసి OG సినిమా చూద్దాం.. OG 2 వస్తే నువ్వే నా స్పెషల్ గెస్ట్” అని ప్రేమగా మాటిచ్చారు. కానీ ఆ కల నిజమయ్యేలోపే.. ఆ అభిమాని ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.
హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ గత కొంతకాలంగా అరుదైన న్యూరోమస్క్యులర్ జన్యు వ్యాధితో పోరాడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన అతడి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించక బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఈ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ పాటలు, డైలాగ్‌లతో చేసిన అతడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం పవన్ దృష్టికి చేరింది. వెంటనే జూన్ 17న స్వయంగా అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు అతడి పక్కనే కూర్చుని మాట్లాడారు. ప్రేమగా హత్తుకుని ధైర్యం చెప్పారు. “అందరూ నన్ను ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారు” అని నిరంజన్ చెప్పినప్పుడు పవన్ కూడా చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేశారు.
వెళ్లే ముందు బహుమతులు, తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందిస్తూ త్వరలో మళ్లీ కలుద్దామని చెప్పారు. కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. తనకు కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా.. ఆరోజే కుక్క పిల్లను అందించారు. అయితే ఆ ఆప్యాయ భేటీ జ్ఞాపకంగా మిగిలిపోగా.. కొన్ని రోజులకే నిరంజన్ మృతి చెందడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఒక అభిమాని చివరి కోరికను నెరవేర్చాలని కోరుకున్న హీరో.. ఇప్పుడు అదే అభిమానిని కోల్పోవాల్సి రావడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.
