
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతోపాటు భగవంతుని తీర్థప్రసాదాలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా తన అభిమాన హీరో అయిన పవన్ కళ్యాణ్‌ను చూడాలని పేరెంట్స్‌కు చెప్పారు. వాళ్లు ఇదే విషయాన్ని తెలంగాణ జనసేన నేతల దృష్టికి చేరేలా చేశారు.
ఇదే విషయాన్ని తెలంగాణ జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. హుటాహుటీన హన్మకొండలోని హన్‌మాన్‌నగర్‌కు చేరుకొని బాలుడిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అలాగే వారికి ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు. అలాగే నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్. వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు.
వరంగల్ లోని యువ అభిమాని నిరంజన్ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత @PawanKalyan గారు. pic.twitter.com/2ms5llHsZ1
— JanaSena Telangana (@JSPTelangana) June 17, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.