
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన కోడి చంద్రయ్య, అంజమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసి ఇద్దరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాడు. కూతురు పెళ్లి సమయంలో ఇల్లు కానీ భూమిలో కొంత భాగం కానీ అమ్మి పెళ్లి చేయమని కొడుకు రాములు పెద్ద మనుషుల సమక్షంలో బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. అయితే పెళ్లికి కట్నంగా తామున్న ఇంటిని కూతురికి గిఫ్ట్ డీడ్ చేశాడు తండ్రి. కొద్ది రోజుల తర్వాత కొడుకు రాములు తల్లిదండ్రులిద్దరిని ఇంటి నుండి గెంటి వేయడంతో గ్రామంలో కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కొడుకు రాములు ద్వారా మెయింటెనెన్స్ ఇప్పించాలని చంద్రయ్య దంపతులు ఆర్డిఓను కోరారు. అధికారుల ఆదేశాలు మేరకు ఉన్న భూమిలో కొంత భాగాన్ని కొడుకుకు ఇవ్వాలని, మిగిలిన భాగాన్ని తండ్రి చంద్రయ్య తీసుకునేలా గ్రామ పెద్దలు తీర్మానించారు. తిరిగి కొంతకాలంగా మిగిలిన భూమిని కూడా తనకు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని తండ్రి చంద్రయ్య వాపోతున్నాడు.
వృద్ధాప్యంలో ఉన్న తమను… భూమికోసం కొడుకు రాములు ఇబ్బందులు పెడుతున్నాడంటూ మునుగోడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఇంటిని ఖాళీ చేయకుండా వ్యవసాయ భూమిలోకి రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారుల స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
తల్లిదండ్రులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగగా, కొడుకు కూడా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీతో ధర్నాకు దిగాడు. చెల్లెలు అలివేలు వివాహానికి ముందే కొన్నేళ్లుగా ఉమ్మడిగా ఉంటున్న ఇంటిని తనకు తెలియకుండా తండ్రి చంద్రయ్య.. చెల్లెలు అలివేలు పేరిట గిఫ్ట్ డీడ్ చేశాడని కొడుకు రాములు వాపోతున్నాడు. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇంటిని ఖాళీ చేయాలంటూ తన తండ్రి తనను ఇబ్బందులు పెడుతున్నాడని రాములు అంటున్నాడు. ఇంటిని ఖాళీ చేయాలనీ పోలీసులతో ఇబ్బందులు పెడుతున్నాడని రాములు వాపోయాడు. ఈ వివాదంపై కోర్టును ఆశ్రయిస్తానని రాములు చెబుతున్నాడు. మొత్తానికి ఆస్తికోసం ఇటు తండ్రి అటు కొడుకు ఆందోళనలు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..