Telangana: ప్రధాని రామగుండం పర్యటన అగ్నిగుండమవుతుంది.. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ అల్టిమేటం.
తెలంగాణలో ప్రధాని మోదీ టూర్‌పై రగడ నడుస్తోంది. ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు, పాతవాటినే..

తెలంగాణలో ప్రధాని మోదీ టూర్‌పై రగడ నడుస్తోంది. ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు, పాతవాటినే మళ్లీ ప్రారంభిస్తూ.. తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారు ఆరోపించారు. యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోదీ పర్యటన అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ గతకొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జేఏసీ నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తమ యాక్షన్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. బిల్లుపై సమాధానం చెప్పకపోతే శనివారం చేపట్టబోయే మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. విద్యార్థి జేఏసీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
తెలంగాణ వికాస సమితి సైతం..
ఇదిలా ఉంటే తెలంగాణ వికాస సమితి సైతం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘విభజన హామీలు నెరవేర్చకుండా, మాట్లాడిన ప్రతిసారీ.. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు.. అని తెలంగాణను అవమానిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. Rfcl ప్రారంభమై విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతోంది. రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికి న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటన పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు కట్టబెట్టి సింగరేణిని చంపాలని చూస్తూన్న నరేంద్ర మోదీ పర్యటనను ఈ ప్రాంత వారసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.. మోడీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణ జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్న మోదీ.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోడీ.. మా రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించిన మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



