MUNUGODE BY-ELECTION: గెలిచినా గులాబీలో అంతర్మధనం.. సమన్వయలోపంపై కమలం వర్రీ.. ఒంటరిని చేశారన్న స్రవంతి.. మూడుపార్టీల్లో సమీక్షలు

కోట్లకు కోట్లు గుమ్మరించిన పార్టీలు, నేతలు ఫలితం వెలువడ్డాక తప్పకుండా ఆత్మావలోకనంలో పడి వుంటారు. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో మునుగోడు ఫలితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..

MUNUGODE BY-ELECTION: గెలిచినా గులాబీలో అంతర్మధనం.. సమన్వయలోపంపై కమలం వర్రీ.. ఒంటరిని చేశారన్న స్రవంతి.. మూడుపార్టీల్లో సమీక్షలు
Munuguode Election Analysis
Follow us

|

Updated on: Nov 09, 2022 | 12:53 PM

మునుగోడు.. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకే కాకుండా పలువురు రాజకీయ నాయకులకు ఓ గుణపాఠం నిల్వబోతున్నది. కోట్లకు కోట్లు గుమ్మరించిన పార్టీలు, నేతలు ఫలితం వెలువడ్డాక తప్పకుండా ఆత్మావలోకనంలో పడి వుంటారు. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో మునుగోడు ఫలితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 80 ఎమ్మెల్యేలు, 15 మంది మంత్రులను మోహరించి, అత్తెసరు మెజారిటీతో విజయం సాధించిన గులాబీ పార్టీ.. విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతోందన్నది పలువురి విశ్లేషణ. కొన్ని పత్రికలకలో ఈ మేరకు కథనాలు వస్తున్నాయి కూడా. ఓటర్లను ప్రలోభ పెట్టడంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం తీసిపోకుండా వ్యవహరించిన బీజేపీ కూడా ఫలితాన్ని విశ్లేషించుకుంటోంది. సమీక్షలో నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ఓటమి కారణమని తేల్చేశారు కమలనాథులు. ఇక కీలక నేతలు ప్రచారంలో హ్యాండివ్వడం వల్లనే తాను మూడో స్థానానికి పరిమితమైనట్లు కాంగ్రెస పార్టీ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి చెబుతున్నారు. పెద్దగా ప్రభావం చూపకపోయినా తనదైన శైలి ప్రకటనలతో హాస్యం పండించారు ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ.పాల్. 15 వేల దాకా ఓట్లు సంపాదిస్తుందనుకున్న బీఎస్పీ కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. ఎంత ఖర్చు చేసినా.. ప్రచారాన్ని ఎంతగా రక్తి కట్టించినా.. ప్రలోభాలకు ధనప్రవాహాన్ని సృష్టించినా అవేవీ ప్రభావం చూపలేదనే కంక్లూజన్‌కు ప్రధాన పార్టీలు వచ్చాయి. ప్రధాన పార్టీలిపుడు అంతర్గత సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి.

మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు బంధు, దళితబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రతీ ఇంటిలో ఇద్దరో, ముగ్గురో అయినా లబ్ధి పొంది వుంటారు.. ఆ లెక్కన మునుగోడులో తిరుగులేని మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించాలి. కానీ అందుకు భిన్నంగా సర్వశక్తులు ఒడ్డినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు వార్డులు, ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా మైక్రో లెవెల్లో పని చేసినా అత్తెసరుగా పదివేల మెజారిటీతో గట్టెక్కడం చాలా మంది టీఆర్ఎస్ నేతలకు జీర్ణమవడం లేదు. చాలా రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛను ఇస్తున్నా.. వృద్ధులు, వితంతువులకే కాకుండా ఎన్నో వర్గాలకు పింఛను అమలు చేస్తున్నా.. వారు కారు గుర్తు వైపు మొగ్గు చూపలేదని గులాబీ పార్టీలో అంతర్మధనం జరుగుతోంది. పైకి విజయ సంకేతాలు చూపిస్తే.. మునుగోడు ఓటర్లు బీజేపీకి బుద్ధి చెప్పారని కామెంట్ చేస్తున్నా లోలోపల మాత్రం ఇది అత్తెసరు విజయమేనని అభిప్రాయపడుతున్నారు.

ఇంటింటా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లెక్కిస్తే ఒక్క మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షలకుపైగా లబ్ధిదారులున్నారు. సెగ్మెంటులోని 2, 41, 855 ఓట్లలో రెండు లక్షలకుపైగా ఏదో ఒక రూపంలో ప్రభుత్వ లబ్ధి చేకూరింది. అలాంటప్పుడు ఈజీగా ఘనవిజయం సాధించాల్సింది. కానీ ఫలితం అందుకు భిన్నంగా వుంది. 40 వేలకుపైగా ఆధిక్యత వస్తుందని అంచనా వేసుకుంటే పట్టుమని పది వేలు రావడమేంటన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గులాబీ నేతల్లో ఇదే అంతర్మథనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూపించి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలని, బీఆర్‌ఎస్ పార్టీకి ఈ ప్రాతిపదకనే వేదిక తయారు చేయాలని భావిస్తుంటే ఇక్కడే సానుకూలత లేకపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం వందకుపైగా ప్రజా ప్రతినిధులను నెల రోజులపాటు మునుగోడులోనే మోహరించింది టీఆర్ఎస్. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా గతంలో ఎన్నడూ లేనంతటి స్థాయిలో ఖర్చు చేసినా ఆశించిన ఆధిక్యం ఎందుకు రాలేదనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. సామ దాన భేద దండోపాయాలతో సర్వ శక్తులు ఒడ్డింది గులాబీ పార్టీ. ఆర్థిక, అంగ బలాలను పూర్తి స్థాయిలో ప్రయోగించింది.

యువత ఎందుకు దూరమైంది?

ఉద్యమ సమయం నుంచి ఉప ఎన్నిక అంటే కేసీఆర్ పార్టీకి కొట్టిన పిండి. రాజీనామా చేయడం.. ఉప ఎన్నికకు వెళ్లడం.. అధికార పార్టీపైనా ఆధిక్యత సాధించడం గతంలో ఎన్నో సార్లు జరిగింది. ఈప్రహసనం 2006లో కరీంనగర్ లోక్‌సభ సీటు నుంచి మొదలైంది.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక అయినా నల్లేరుపై బండి నడకేనన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వుండింది. కానీ దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఖంగుతినడంతో మునుగోడును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్ టీమ్. దుబ్బాక, హుజురాబాద్ టీఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానాలు. ఆ రెండింటినీ బీజేపీకి సమర్పించుకున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో బీజేపీతో హోరాహోరీ తలపడింది. విజయం సాధించింది. నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి యువత పెద్ద ఎత్తున ఆ పార్టీకి అండాదండాగా వుంటూ వచ్చింది. రాజీనామాలు చేసి, ప్రజాతీర్పు కోరిన ప్రతీసారి నియోజకవర్గానికి సంబంధంలేకపోయినా తెలంగాణ యువత పెద్ద ఎత్తున ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి.. తెలంగాణ రావాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఎంత అవసరమమో స్వచ్ఛందంగా ప్రచారం చేసిన యువత వేల సంఖ్యలో వుంది. కానీ తాజాగా మునుగోడు ఉపఎన్నికలో యువత టీఆర్ఎస్‌కు దూరమై, బీజేపీకి దగ్గరైన సంకేతాలు వెలువడ్డాయి. ఇది గులాబీ నేతలను మరింత వర్రీకి గురిచేసే అంశంగా కనిపిస్తోంది.

ఓటమి తర్వాత నవంబర్ 7వ తేదీన నియోజకవర్గానికి చెందిన నేతలతో సమావేశమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి యువత పెద్ద ఎత్తున సానుభూతి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకుంటామని సంఘీభావం ప్రకటించారు. మొన్నటి దాకా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదనే ఆగ్రహం యువతలో కనిపించేందు. కానీ ఈ మధ్య నోటిఫికేషన్ల జారీ జోరందుకుంది. ఉద్యోగాలివ్వడం కూడా మొదలైంది. ఈక్రమంలో యువత తమకే మద్దతు తెలుపుతారని టీఆర్‌ఎస్‌ నేతలు భావించారు.కానీ, మునుగోడులో అందుకు భిన్నమైన పరిస్థితి వున్నట్లు ఫలితం ద్వారా తేలింది. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించిన గులాబీ నేతలు.. మునుగోడులో కృతఙ్ఞతా సభను నిర్వహించి, దానికి ముఖ్యమంత్రిని రప్పించాలని తలపెట్టారు. అదేసమయంలో పదిహేను రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న హామీ అమలవుతోందని చాటేలా కొన్నైనా పథకాలకు శ్రీకారం చుట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.

సమన్వయ లోపమే కొంప ముంచింది

ఇక విజయం ముందర బొక్కబోర్లా పడిన బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నవంబర్ 7వ తేదీన సమావేశమయ్యారు. మునుగోడు ఫలితాన్ని సమీక్షించుకున్నారు. ఉప ఎన్నికలో నేతల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఓటమి చవిచూశామని బీజేపీ ముఖ్యనేతలు తేల్చారు. ప్రచారపర్వంలో ప్రణాళిక లోపం కూడా ఇందుకు ఒక కారణమని వారు పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు మండల ఇన్‌చార్జిలతో రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై మునుగోడు ఫలితాలపై సమీక్షించారు. ఎంపీ లక్ష్మణ్‌, ప్రధాన నేతలు ఈటల రాజేందర్‌, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, వివేక్‌ వెంకటస్వామి, బాబూమోహన్‌, బూర నర్సయ్యగౌడ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాసరెడ్డి, స్టీరింగ్‌ కమిటీ సమన్వయకర్త జి.మనోహర్‌రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

దాదాపు 3 గంటల పాటు కొనసాగిన సమీక్ష సమావేశంలో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. ఒక్క ఉప ఎన్నికలో గెలిచేందుకు అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తూ.. దిగజారుడు రాజకీయం చేసిందని కమలం నేతలు అభిప్రాయపడ్డారు. ఎంత చేసినా చివరికి కమ్యూనిస్టులకు ట్రెడీషనల్‌గా వున్న పది, పదిహేను వేల ఓట్లతోనే టీఆర్ఎస్ గెలిచిందని తేల్చారు. మునుగోడులో గెలిచేందుకు సీఎం సహా మంత్రులు చేసిన వాగ్ధానాల అమలు కోసం వెంటపడాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నెల రోజులపాటు వేచి చూసి.. ఆ తర్వాత ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైతే ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

నన్ను ఒంటరిని చేశారు..!

ఇక తన తండ్రి గతంలో వరుస విజయాలు సాధించిన మునుగోడులో తాను గెలవాలని అనుకున్న పాల్వాయి స్రవంతికి సొంత పార్టీ నేతలే పూర్తిగా సహకరించలేదు. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రచారానికి దూరముండడమే కాకుండా పరోక్షంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ప్రచారం చేయడాన్ని స్రవంతి జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరెడ్డి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని పైకి చెబుతున్నా లోలోపల తన దారుణ ఓటమికి వెంకటరెడ్డే బాధ్యుడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరూ రాహుల్ పాదయాత్రపైనే ఫోకస్ చేశారని, చివరి నాలుగైదు రోజులైతే తనను లిటరల్‌గా ఒంటరిని చేశారని స్రవంతి భావిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో చోటుచేసుకున్న పరిణామాలు చూశాక రాజకీయాల్లో కొనసాగాలంటేనే భయమేస్తోందని స్రవంతి అన్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో రెండు అధికార పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆరోపించారు. చిన్న పిల్లలను కూడా తమ స్వార్థానికి వాడుకున్నారని, నాసిరకం, కల్తీ మద్యానికి బానిసలను చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..