బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఫ్లెక్సీని ప్రదర్శించారు. తనపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు శేజల్ తెలిపారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే మాపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా, బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ శేజల్ ఆరోపించారు.
దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని.. తనలాగే ఎంతోమంది బాధితులున్నారని శేజల్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే పెద్ద ఉమనైజర్ అని.. ఆధారాలన్నీ భద్రంగా ఉంచామని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని బాధితురాలు శేజల్ తెలిపారు.
కాగా.. గత కొంతకాలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని.. మానసికంగా హింసించారంటూ పేర్కొనడం, అంతేకాకుండా వాట్సప్ చాట్ బయటపెట్టడం కలకలం రేపింది. అయితే, శేజల్ చేసిన ఆరోపణలు దుర్గం చిన్నయ్య సైతం అప్పట్లో ఖండించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..