Itlu Mee Niyojakavargam: కామ్రేడ్స్ అడ్డాలో కమలం పాగా వేసేనా.. ఎర్రన్నలతో కలిసి నడవాలని బీఆర్ఎస్ నిర్ణయం.. చిక్కుల్లో చిన్నయ్య..!
తలాపున జీవనది ప్రాణహిత పరవళ్లు.. కడుపులో నల్లబంగారు సిరులు.. పచ్చని ప్రకృతి.. సహజ వనరులకు కొదువుల లేని స్థితి. ఇది బెల్లంపల్లి నియోజకవర్గం స్వరూపం. మరీ ఈ నియోజక వర్గంలో రాజకీయ స్వరూపం ఎలా ఉంది. ముచ్చటగా మూడవ సారి టికెట్ దక్కించుకుని గెలుపు జెండా ఎగరువేయాలని ఉవ్విలురూతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి.

మంచిర్యాల జిల్లా సింగరేణి ఖిల్లాలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం బెల్లంపల్లి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆసిపాబాద్ నుంచి వేరుపడిన బెల్లంపల్లి అచ్చంగా సింగరేణి ప్రాంతం. అందుకే, ఇక్కడ సింగరేణి కార్మికసంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగానే గతంలో ఇక్కడ కామ్రేడ్ల హవా నడిచేది. కానీ, రాష్ట్ర విభజన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పుడో లెక్క… ఇప్పుడో లెక్క… అన్నట్టుగా మార్చేసింది బీఆర్‌ఎస్. 2014 నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధించి… గులాబీకోటను నిర్మించారు దుర్గం చిన్నయ్య. 2009లో ఈస్థానాన్ని మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి వదిలేసిన బీఆర్‌ఎస్.. ఆ తర్వాత ఒడిసిపట్టింది. ఆ ఎన్నికల్లో కామ్రేడ్ గుండా మల్లేష్ గెలిచినా.. ఆ తర్వాత గులాబీ గుబాలించడంతో ఎర్రన్నల ప్రభ మసకబారింది. గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి కేవలం ఐదువేల లోపు ఓట్లు వచ్చాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… 2014లో 50వేలకుపైగా మెజార్టీతో గుండా మల్లేష్‌ను ఓడించిన దుర్గం చిన్నయ్య.. 2018 ఎన్నికల్లోనూ గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన గడ్డం వినోద్… బీఎస్పీ నుంచి బరిలోనిలిచి గట్టి పోటీ ఇచ్చినా… 11వేలకుపైగా మెజార్టీతో గెలిచారు చిన్నయ్య. అదే ఉత్సాహంతో మూడోసారి పోటీకి సై అంటున్నారు. అయితే హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన చిన్నయ్యకు.. సొంత పార్టీలో టిక్కెట్ పోరు తలనొప్పిగా మారింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, పెద్దపల్లి ఎంపి బోర్లాకుంట వెంకటేష్ నేత.. ఇక్కడి నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ప్రవీణ్‌కు సుమన్ అండ ఉందనే ప్రచారం
ప్రవీణ్… టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నారు. ఉద్యమనేతగా గుర్తింపు పొందిన ఆయన.. చిన్నయ్యకు పార్టీలో గట్టి పోటీదారుగా మారారు. గతఎన్నికల్లోనే టికెట్ కోసం ఫైట్‌చేసి ఫెయిలయ్యారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అండతో ఈసారి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ప్రవీణ్ ఉన్నారన్న చర్చ జరిగింది. అయితే, ఈ మధ్య సుమన్‌తో ప్రవీణ్ కు గ్యాప్ పెరిగిందనీ.. కాబట్టి టిక్కెట్ కష్టమేననీ ప్రచారం మొదలైంది. గత ఎన్నికలసందర్భంగా చివరి నిమిషంలో పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ సాధించిన వెంకటేశ్‌నేత.. అదే ట్రిక్స్ ప్లే చేసి బెల్లంపల్లి ఎమ్మెల్యే సీటును సైతం కైవసం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, ఇక్కడ గులాబీ క్యాడర్‌కు కన్ఫ్యూజన్ ఎక్కువైంది.
ఎర్రన్నలతో కలిసి నడవాలని కేసీఆర్ నిర్ణయం
అయితే, దేశరాజకీయాల వైపు సాగుతున్న కేసీఆర్… ఎర్రన్నలతో కలిసి నడువాలని నిర్ణయించారు. ఆ పొత్తులో భాగంగా బెల్లంపల్లి టిక్కెట్‌ను కామ్రేడ్లకు వదిలేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే దుర్గం చిన్నయ్య సైడవ్వాల్సిందేనంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. కాకపోతే, ఇక్కడ వామపక్షాలకు బలమైన నేత లేకపోవడంతో.. బీఆర్‌ఎస్ తరపునే అభ్యర్థి ఉంటారనే అభిప్రాయమూ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కావడంతో వామపక్ష భావజాలంతో ఉండే కార్మికుల ఓట్లు పడుతాయని గులాబీబాస్ లెక్కలేస్తున్నట్టు తెలుస్తోంది.
వినోద్‌కు చెక్‌పెడుతున్న ప్రేంసాగర్ రావు
నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తున్నా.. ఆ పార్టీని వర్గ పోరు వేదిస్తోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుండి పోటీ చేసి గట్టిపోటినిచ్చిన మాజీ మంత్రి గడ్డం వినోద్… ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆరునూరైనా విజయం సాధించి గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు గడ్డం. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తున్నది… తదనంతర రాజకీయ పరిణామాల మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే, వినోద్ కు చెక్ పెట్టేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు… ఎల్లయ్య అనే కొత్తనేతను బెల్లంపల్లి బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తుండటం కాంగ్రెస్‌కు పెద్ద మైనస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్.
కామ్రేడ్ పాత అడ్డాలో పాతుకుపోవాలనుకుంటున్న కమలం
బీజేపీ హవా ఎక్కడ నడిచినా… కామ్రెడ్ల ఇలాకాలో మాత్రం అస్సలు కుదరదు. అందుకే, బెల్లంపల్లిలో ఇన్నాళ్లూ కామ్‌గా ఉండిపోయింది. ఇప్పుడు కాస్త సీన్ మారింది కాబట్టి,, తన సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది కాషాయ పార్టీ. కామ్రేడ్లకు చెక్‌పెట్టిన గులాభీ గుబాలింపును… వచ్చే ఎన్నికల్లో అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2018లో కమలం గుర్తుపై పోటీచేసి ఓడిన హేమాజీ… మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పూర్తిస్థాయిగా కామ్రేడ్ల పట్టుండేది కాబట్టి.. బీజేపీకి కష్టమేనన్న అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి.. గెలుపుపై ఆశలు పెట్టుకుంది బీజేపీ. క్యాడర్ బలంగా లేకపోయినా.. స్ట్రాంగ్ లీడర్ చేరితే సమీకరణలు మారతాయని భావిస్తోంది.
నేతగాని ఓట్లెక్కువ.. ఆ తర్వాత బీసీలదే హవా
లక్షా 60వేలకు పైగా ఓట్లున్న బెల్లంపల్లిలో నేతగాని సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. ఎస్సీల్లో 29 శాతం ఈ సామాజిక వర్గం ఓటర్లే ఉండగా… 10 శాతం మాల, మాదిగ వర్గం ఓటర్లు ఉన్నారు. ఓట్ షేరింగ్‌లో ఆ తరువాత స్థానం బీసీలది. సామాజిక వర్గాల వారిగా.. ఎవరికివారు బలంగా ఉండటంతో వచ్చేసారి సమీకరణలు ఎలా మారుతాయోనన్న ఆసక్తి ఏర్పడింది.
60శాతానికి పైగా హామీలు నెరవేర్చానంటున్న చిన్నయ్య
అభివృద్ధి విషయంలో అందరికంటే ముందున్నానంటున్నారు ఎమ్మెల్యే చిన్నయ్య. 2014 , 18 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 60 శాతానికి పైగా పూర్తి చేశాననీ.. అదే తనను గెలిపిస్తుందనీ ధీమాగా ఉన్నారు. విద్యావైద్యం విషయంలో.. నియోజకవర్గాన్ని అభివృద్ధిబాట పట్టించానని చెబుతున్నారు.
చిన్నయ్య అసమర్థత వల్లే మెడికల్‌కాలేజ్ మిస్సయ్యిందా..?
అయితే, ప్రతిపక్షాల వెర్షన్ ఎమ్మెల్యేకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాకు రావాల్సిన మెడికల్ కాలేజీ.. చిన్నయ్య చేతకానితనం వల్లే… మంచిర్యాలకు తరలివెళ్లిందని ఆరోపిస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా అప్‌గ్ఏడ్ చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. బెల్లంపల్లి హాస్పిటల్‌ను వందపడకలకు అప్‌గ్రేడ్ చేసినా… వైద్య సిబ్బంది కొరతతో మళ్లీ పాతకథే వినిపిస్తోంది.
చిన్నయ్యకు అనుచరులతో మచ్చ
బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాలనీల పరిస్థితి అద్వాన్నంగా మారింది. మరోవైపు, లోకల్‌గా ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయ్. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేస్తున్నారనీ విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయ్. అంతేకాదు, ప్రజలకు అందుబాటులో ఉంటాడని చిన్నయ్యకు మంచిపేరే ఉన్నా… దూకుడుగా వ్యవహరించడం.. అవసరమైతే నోటికీ, చేతికీ పనిచెప్పడం… వివాదాల్లో చిక్కుకునేలా చేస్తోంది.
సింగరేణి భూములకు పట్టాలెప్పుడిచ్చేది?
ఓపెన్ కాస్ట్ గనుల ఖిల్లాలో రాజకీయ వేడి ఎంత హీటెక్కిస్తుందో.. ప్రజా సమస్యలు సైతం అదే రేంజ్‌లో మంటపుట్టిస్తున్నాయ్. కాళేశ్వరం జలాలతో బీడు భూములకు పచ్చదనం తీసుకొస్తామన్న ఎమ్మెల్యే హామీ అటకెక్కింది. నియోజక వర్గ కేంద్రంలో 70 శాతం సింగరేణి భూములే కావడంతో… వాటికి పట్టాలిస్తామని స్వయంగా సీఎం కేసీఆరే హామీ ఇచ్చినా.. అమలు కాలేదు. ఇది లోకల్‌గా ఎమ్మెల్యే కు భారీ మైనస్ అయ్యే అవకాశం ఉంది.
చిన్నయ్య హ్యాట్రిక్ ఆశలకు గండిపడుతుందా?
జనంలో ఉంటాడు, కలుపుగోలుగా ముందుకెళ్తాడు… నిత్యం అందుబాటులో ఉంటాడు.. ఈ ఒక్క పాజిటివ్ ముచ్చటే ఎమ్మెల్యే చిన్నయ్యను గట్టిగా నిలబెడుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో టాప్‌ప్లేస్ పొందడం.. ఆయనకు అదనపుబలం. కాకపోతే, ఆయన హ్యాట్రిక్ ఆశలకు గండికొట్టాలని ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయ్. దీంతో ఈసారి టగ్ ఆఫ్ వార్ తప్పేలా లేదు. మరి, బెల్లంపల్లి జనం ఎవరి మొగ్గు చూపుతారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
