AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kagar: ఆపరేషన్‌ కగార్‌లో కీలక పురోగతి.. కర్రెగుట్టల్లో జాతీయజెండాను ఎగురవేసిన జవాన్లు..

కర్రెగుట్టల్లో కథ క్లైమాక్స్‌కు చేరుతోంది. 9 రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్‌లో..మావోయిస్టులను రౌండప్‌ చేశాయి కేంద్రబలగాలు. శరణమా? మరణమా? తేల్చుకోవాలంటూ సంకేతాలు ఇస్తున్నాయి. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్‌ను..రాయ్‌పూర్ నుంచి ఐపీ చీఫ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కర్రెగుట్టల్లో బలగాలు జాతీయ జెండాను ఎగురవేశాయి..

Operation Kagar: ఆపరేషన్‌ కగార్‌లో కీలక పురోగతి.. కర్రెగుట్టల్లో జాతీయజెండాను ఎగురవేసిన జవాన్లు..
Operation Kagar
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2025 | 8:54 PM

Share

ఆపరేషన్‌ కగార్‌లో కీలక పురోగతి సాధించాయి భద్రతా బలగాలు. మావోయిస్టులకు కంచుకోటలాంటి కర్రెగుట్టల్లో జవాన్లు తొలిసారి జాతీయజెండా ఎగరవేశారు. వామపక్ష తీవ్రవాదంపై ఇది ప్రభుత్వం సాధించిన విజయం అంటున్నాయి భద్రతా బలగాలు. మార్చి 31, 2026లోపు మావోయిస్టుల అంతమే పంతంగా ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిన కేంద్ర బలగాలు..అందులో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టున్న కర్రెగుట్టల్లో వేట కొనసాగిస్తున్నాయి. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కోసం ఎప్పటికప్పుడు హెలికాప్టర్లు ద్వారా అదనపు బలగాలను తరలిస్తున్నారు. దట్టమైన అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టుల కోసం శాటిలైట్‌ చిత్రాలను, అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

బ్లాక్ హిల్స్‌గా పేరొందిన కర్రెగుట్టలు..మావోయిస్టులకు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్. గోదావరి ఒడ్డున, దట్టమైన అడవులు, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది. అంతేకాదు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బార్డర్ లొకేషన్. దీంతో ఈజీగా తప్పించుకునే వీలు ఉంటుంది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ను కేంద్రబలగాలు స్వాధీనం చేసుకోవడంతో..ఈ ప్రాంతాన్ని షెల్టర్‌ జోన్‌గా మావోయిస్టులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా నియంత్రణ సాధిస్తే మావోయిస్టుల నెట్‌వర్క్‌కు తీవ్ర దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టాయి. ఈ గుట్టల్లో ఇప్పటికే మావోయిస్టులు ఉపయోగించిన బంకర్లను, డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

800 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం ప్రస్తుతం జవాన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఈ గుట్టలో తలదాచుకున్న 1000 మంది మావోయిస్టుల కోసం అణువణువు గాలిస్తున్నారు జవాన్లు. మావోయిస్టుల కోసం డ్రోన్లతో గాలిస్తూ అనుమానం ఉన్న ప్రాంతాల్లో హెలికాప్టర్లతో బాంబులు వేస్తున్నారు. లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని మావోయిస్టులకు ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలను పంపించారు. రాయ్‌పూర్ నుంచి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు ఐబీ చీఫ్ తపన్‌ దేకా. కర్రెగుట్టల్లో ఇప్పటికే తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేసిన బలగాలు.. కమ్యూనికేషన్ కోసం గుంజిపర్తి గ్రామంలో సెల్ టవర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు భారీ ఎండల్లో దట్టమైన అడవుల మధ్య సాగుతున్న ఈ ఆపరేషన్‌లో బలగాలు కూడా టఫ్ కండీషన్‌ను ఫేస్ చేస్తున్నాయి. భారీ ఎండలకు జవాన్లు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీంతో అస్వస్థతకు గురైన వారిని హెలికాప్టర్‌లో బీజాపూర్ తరలిస్తున్నారు. వారి ప్లేస్‌లో బ్యాకప్ టీములను పంపిస్తున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..ఆపరేషన్‌పై వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచాలంటే కర్రెగుట్టల్లో ఆధిపత్యం సాధించడం కీలకమని చెబుతున్నారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమంటూ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. ప్రజా సంఘాలు కూడా కాల్పులు విరమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.అటు కేంద్రం మాత్రం ఆపరేషన్‌ కగార్‌పై వెనకడుగు వేసేది లేదంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..