Hyderabad: అయ్యో పాపం.. పండు వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..!
దోమల పొగ ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. మంచానికి సమీపంలో వెలిగించిన మస్కిటో కాయిల్ నిప్పు పరుపునకు అంటుకుంది. అదీ కాస్తా ఇల్లంతా పొగ వ్యాపించి, వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయ్యో పాపం.. మస్కిటో కాయిల్ ఓ వృద్ధురాలి ఉసురు తీసింది. కాయిల్ వెలిగించి మంచానికి దగ్గరలో పెట్టడంతో పరుపునకు నిప్పంటుకుంది. ఆ పొగ పీల్చుకుని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనసూయ అనే 82 ఏళ్ల వృద్ధురాలు.. గతంలో రైల్వేలో పనిచేసి రిటైరయ్యారు. ఆమె తన కొడుకు మోహన్ శ్రీనివాస్‌తో కలిసి మల్కాజిగిరిలో నివాసం ఉంటున్నారు. ఆమె వృద్ధాప్య సమస్యలతో మంచానికే పరిమితమయ్యారు.
సోదరి ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి 7వ తేదీన బెంగళూరు వెళ్లారు. తల్లిని చూసుకునేందుకు ఒక మనిషిని పురమాయించాడు. అయితే ఫిబ్రవరి 11, మంగళవారం తెల్లవారుజామున తిరిగి నగరానికి వచ్చేందుకు శ్రీనివాస్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఇంతలో వారి ఇంట్లో రెంట్‌కు ఉంటున్న సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సంతోష్.. ఆ విషయం శ్రీనివాస్‌కు చెప్పాడు. దీంతో శ్రీనివాస్ వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. వెంటనే వారు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. అనసూయ గదిలో నుంచి పొగలు రావడాన్ని గమనించి అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆమె అపస్మారకస్తితిలో కనిపించింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం(ఫిబ్రవరి 12) ఆమె కన్నుమూసింది.
మస్కిటో కాయిల్ పరుపు అంటుకోవటంతో దాన్నుంచి వచ్చిన పొగ వల్ల ఊపిరి ఆడక ఆమె మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ఆమె శరీరంపై ఎటువంటి కాలిన గాయాలు లేవని.. కేవలం పొగ కారణంగానే చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
