Telangana: ప్రీతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. అక్కను హత్య చేశారంటూ తమ్ముడు సంచలన ఆరోపణలు..

|

Mar 02, 2023 | 9:44 AM

ఒక మృతి.. ఎన్నో అనుమానాలు. తనంతట తానే చనిపోయిందా? లేక చంపేశారా? ప్రీతి మృతిపై ఎన్నో డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఓవైపు సైకో సైఫ్‌ టార్చర్..

Telangana: ప్రీతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. అక్కను హత్య చేశారంటూ తమ్ముడు సంచలన ఆరోపణలు..
Preethi Brother
Follow us on

ఒక మృతి.. ఎన్నో అనుమానాలు. తనంతట తానే చనిపోయిందా? లేక చంపేశారా? ప్రీతి మృతిపై ఎన్నో డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఓవైపు సైకో సైఫ్‌ టార్చర్.. చదువు మానేద్దామంటే సవాలక్ష రూల్స్. ఇలా ప్రీతి ఎన్నో భయాలతో సతమతం అయినట్టు తెలుస్తోంది. ప్రీతి తమ్ముడు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యే అంటున్నాడు. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ మాత్రం సుధీర్ఘంగా చర్చించి రిపోర్ట్‌ యూజీసీకి పంపుతోంది. మరోవైపు, సైఫ్‌ను 4 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

ప్రీతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌..

ప్రీతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఆత్మహత్యేనని పోలీసులు.. కాదు హత్యేనని ప్రీతి తమ్ముడు.. ఇంతకీ ఫిబ్రవరిద 21వ తేదీ రాత్రి ఏం జరిగింది.. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్నదానికీ.. ప్రీతి తమ్ముడు చెబుతున్నదానికీ ఎందుకు పొంతన కుదరడం లేదనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రీతి సోదరుడు పృథ్వి వంశీ ఆరోపణలు..

ప్రీతి సూడైడ్ కేసు రిమాండ్ రిపోర్టు లో అవాస్తవాలు ఉన్నాయని ఆమె సోదరుడు పృథ్వి వంశీ ఆరోపించాడు. వారు పేర్కొన్నట్లు డాక్టర్ల సమక్షంలో ఎలాంటి కౌన్సిలింగ్ జరుగలేదన్నాడు. ఆ మరుసటి రోజే తన అక్క చనిపోయిందని వాపోయాడు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో హెచ్‌ఓడీ, ఏసీపీ లను ఉంచారని, వారు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పృథ్వి. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా వాళ్లనే ర్యాగింగ్ కమిటీలో ఉంచడం దారుణం అన్నాడు. తన అక్క మొబైల్‌లో చాటింగ్ డిలీట్ అయ్యిందని, చాట్ రిట్రివ్ చేస్తే పూర్తి విషయాలు బయటకొస్తాయని అన్నాడు. తన అక్క చేతికి, పొత్తి కడుపు వద్ద కోసిన గాయాలు ఉన్నాయని, అదంతా ఎవరు చేశారు? అని ప్రశ్నించాడు పృథ్వి. తన అక్క ప్రీతిది హత్య అనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, కాదు.. సూసైడ్ చేసుకుందనడానికి మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయంటూ విచారణాధికారులను ప్రశ్నించాడు పృథ్వి. సైఫ్‌తో మాట్లాడిన భార్గవి, అనూష మరికొందరిని విచారించి వాళ్లపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు పృథ్వి.

ఇవి కూడా చదవండి

సీనియర్లతో కలిసి పని చేయాలంటే నరకమే..

కాగా, జనరల్‌గా కాలేజీలో క్లాసులతో పాటు, ప్రాక్టికల్‌ గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పని చేయాలి. వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ ఛాలెంజ్‌ లాంటిదే. సైఫ్ లాంటి ఆకతాయిలుంటే అంతకన్నా నరకం మరొకటుండదు. ప్రీతిని సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ మానసికంగా వేధించాడు. కాకతీయ మెడికల్‌ కాలేజీ యాంటీ ర్యాగింగ్‌ కమిటీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. కేఏంసీ ప్రిన్సిపల్‌ డా.మోహన్‌దాస్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు జరిగిన పరిణామాలపై చర్చించారు. ప్రీతి, సైఫ్‌కు మధ్య విభేదాలకు కారణమేంటి? ప్రీతికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన వైద్యులెవరు? సైఫ్‌తో కలిసి ప్రీతి ఎన్నిసార్లు నైట్‌ డ్యూటీ చేసింది. అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్న గొడవేంటి అన్నదానిపై నాలుగు గంటలపాటు సుధీర్ఘ చర్చ జరిగింది.

ప్రీతిని మానసికంగా వేధించిన సైఫ్‌..

ప్రీతిని సైఫ్‌ మెంటల్ హెరాస్‌ చేశాడని యాంటీ ర్యాగింగ్‌ కమిటీ తేల్చేసింది. పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని హేళన చేస్తూ ఆమెను కించపర్చేవిధంగా సైఫ్‌ పోస్టింగ్‌లు పెట్టినట్టు కమిటీ నిర్ధారించింది. కోటాలో ఫ్రీ సీటు కొట్టేసిందని, ఆమెకు చుక్కలు చూపించాలని ఫ్రెండ్‌కు కూడా మెసేజ్‌ పెట్టినట్లు సమావేశంలో చర్చకొచ్చాయట.

అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీనీ విచారణ..

అయితే.. జీఎంహెచ్‌ ఆసుపత్రిలో ప్రీవెంట్ అనస్థీషియా రిపోర్ట్‌ విషయంలో జరిగిన వాగ్వాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణం కాదని కమిటీ తేల్చింది. ప్రీతి, సైఫ్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చిన అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడి నాగార్జునరెడ్డినీ కమిటీ పిలిపించి విచారించింది. సైఫ్‌ తనను టార్గెట్‌ చేస్తూ వేధించాడని ప్రీతి ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. పలుసార్లు ప్రీతి ఏడుస్తూ.. తన దగ్గర ఆవేదన వ్యక్తం చేసిందని, తాను ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపానని నాగార్జున రెడ్డి కమిటీ ఎదుట చెప్పారు. అయితే నాగార్జున రెడ్డి చెప్పేదంతా ఫాల్స్ అంటున్నాడు ప్రీతి తమ్ముడు.

సైఫ్‌ ఫోన్‌లో 17 వాట్సాప్‌ చాట్స్‌..

మరోవైపు, రిమాండ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. సైఫ్ మొబైల్‌ ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించారు పోలీసులు. అనూష, భార్గవి, LDD+ knockouts గ్రూప్ చాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో రెండు ఘటనలు జూనియర్ ప్రీతిపై సీనియర్ సైఫ్‌కు ఆగ్రహం తెప్పించాయి. అందులో ఒకటి గతేడాది డిసెంబర్‌లో జరిగింది. ఓ యాక్సిడెంట్‌ కేసులో ప్రీతిని గైడ్‌ చేశాడు సైఫ్. అప్పుడు ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్‌ను ప్రీతి రాసింది. అది సైఫ్‌కు ఏమాత్రం నచ్చలేదు. దాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసిన అతను.. రిజర్వేషన్‌ కోటాలో ఫ్రీ సీట్ అంటూ ఎగతాళి పోస్టులు పెట్టాడు. అవమానంగా భావించిన ప్రీతి.. నాతో నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా అంటూ సైఫ్‌ను స్ట్రెయిట్‌గా అడిగింది. ఏదైనా ప్రాబ్లమ్‌ ఫీలయితే హెచ్ఓడీకి చెప్పాలని ఏకంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో సైఫ్ ఇగో దెబ్బతింది. ప్రీతిని వేధించాలంటూ తన స్నేహితుడు భార్గవ్‌కు చెప్పాడు. RICUలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని కోరాడు. ఇవన్నీ భరించలేకపోయిన ప్రీతి.. గత నెల 21న హెచ్ఓడి నాగార్జునకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు డాక్టర్ల సమక్షంలో ప్రీతి, సైఫ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఇందులో చాలా విషయాలు దాస్తున్నారని అంటున్నాడు ప్రీతి తమ్ముడు.

సైఫ్‌కు నాలుగు రోజుల కస్టడీ..

డాక్టర్‌ ప్రీతి సోదరుడి సంచలన ఆరోపణలతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రిమాండ్‌ రిపోర్ట్‌లో అన్నీ అవాస్తవాలే ఉన్నాయంటూ, నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి.. తమకు న్యాయం చేయాలంటున్నాడు ప్రీతి తమ్ముడు. మరోవైపు, సైఫ్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో సైఫ్‌ చెప్పేదాన్ని బట్టి యూజీసీ నిర్ణయానుసారం ప్రీతి కేసులో నెక్ట్స్‌ యాక్షన్‌ ఉండనుంది.

ప్రీతి తమ్ముడు మాట్లాడిన వీడియో..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..