వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు ఓ రేంజ్ లో విజృంభిస్తున్నాయి. ఓ వైపు డెంగ్యూ తో జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు నార్వాక్ వైరస్ నరకం చూపిస్తోంది. చిన్నారులు, వృద్ధులే టార్గెట్‌గా విజృంభిస్తోంది. అసలింతకీ ఏంటి నార్వాక్ వైరస్…? ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయ్…? నార్వాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ రోజు తెలుసుకుందాం..
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాలతో పాటు… కొత్తరకం వైరస్‌లూ వచ్చేశాయి. జనాలపై దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం నార్వాక్ వైరస్ నరకం చూపిస్తోంది. నార్వాక్ బాధితులతో హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ నిండింది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో నార్వాక్ వైరస్ బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా వానాకాలంలో వ్యాప్తి చెందే ఈ వైరస్… చిన్నపిల్లలు, వృద్దులే టార్గెట్‌గా విజృంభిస్తోంది. దీంతో వందలాది మంది చిన్నారులు, వృద్దులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, డీ హైడ్రేషన్, కడుపులో వాపు, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో హాస్పిటల్స్‌కి క్యూ కడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి నార్వాక్ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరి ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుందంటున్నారు వైద్యులు. తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు. వైరస్ బారిన పడిన 12 నుంచి 48 గంటలలోపు లక్షణాలు బయటపడతాయంటున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి ఈ వాన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా… వర్షకాలం పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త పడకుంటే… తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..