Telangana: కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిన కేంద్రం.. రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన..

|

Dec 24, 2022 | 5:57 AM

ఊరించి ఊరించి తెలంగాణకు మొండిచేయి చూపించింది కేంద్రం. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ ప్రకటించింది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ఇది.

Telangana: కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై చేతులెత్తేసిన కేంద్రం.. రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన..
Kazipet Railway Coach Facto
Follow us on

ఊరించి ఊరించి తెలంగాణకు మొండిచేయి చూపించింది కేంద్రం. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ ప్రకటించింది. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ఇది. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకుంది కార్మికలోకం. అయితే, ఆ ఆశలను సమాధి చేసేసింది కేంద్రం. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను తుంగలో తొక్కుతూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ రాజ్యసభ వేదికగా ప్రకటించారు రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్‌.

బీఆర్‌ఎస్‌ ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఆయన. ప్రస్తుతం భవిష్యత్‌ అవసరాలకు సరిపోయేలా కోచ్‌ల తయారీ సామర్ధ్యం దేశంలో ఉందన్నారు రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్‌. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్‌ వేదికగా అడిగింది నిలదీసింది ప్రశ్నించింది. అయితే, సమాధానం దాటవేస్తూ వచ్చిన కేంద్రం… ఇప్పుడు తేల్చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమంటూ తెలంగాణకు మొండిచేయి చూపించింది.

ఒకపక్క కొత్తగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూనే, కొన్ని రాష్ట్రాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది కేంద్రం. దేశంలో ఎక్కడా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో ప్రకటించింది కేంద్రం. కానీ, మహారాష్ట్ర లాతూర్‌లో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది మోదీ ప్రభుత్వం. లేటెస్ట్‌గా అసోం కొక్రాజార్‌లోనూ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించింది కేంద్రం. కానీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి మాత్రం మొండిచేయి చూపించడంపై మండిపడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..