నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన పెళ్లి కూతురు ఆత్మహత్య కేసులో మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు పెళ్లి కొడుకు వేధింపులే కారణమని చేసిన ఆరోపణలపై స్పందన వచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని అన్నాడు వరుడు. రవళికి, తనకు మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదని స్పష్టం చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి 10.30 కాల్ చేసి రవళితో మాట్లాడానన్నాడు. రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడానని, కేవలం ఫోటో షూట్ కోసం మండపానికి తొందరగా రావాలని చెప్పానని వివరించాడు వరుడు సంతోష్. ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ అయ్యిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదన్నాడు.
రవళిని తాను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదన్నాడు. ఒక సందర్భంలో జాబ్ చేస్తావా? అని మాత్రమే అడిగానని, తాను చేయనని చెప్పడంతో సైలెంట్ అయ్యాయని చెప్పాడు. అది కూడా కోర్సులకు సంబంధించి అడిగినట్లు తెలిపాడు సంతోష్. కేసును పూర్తిగా విచారించాలని, కాల్ రికార్డ్స్ అన్నీ బయటకు తీయాలని డిమాండ్ చేశాడు సంతోష్. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు. అమ్మాయికి ఎలాంటి ఇబ్బుందులు ఉన్నాయో తనకు తెలియదని, తాను ఆస్తి గురించి ఎప్పుడూ అడగలేదన్నాడు. పెళ్లి ఖర్చులు అన్నీ తానే పెట్టుకుంటున్నట్లు తెలిపాడు సంతోష్.
ఇక సంతోష్ తల్లిదండ్రులు కూడా రవళి ఆత్మహత్యపై స్పందించారు. తమ అబ్బాయికి, రవళి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, అది చూసి తాము షాక్‌కు గురయ్యామన్నారు. ఈ కేసును పోలీసులు పూర్తిగా విచారించాలని వారు డిమాండ్ చేశారు. నిజానిజాలు బయటకు రావాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..