లోక్ సభ ఎన్నికల వేళ ఆదివాసీ తెగల్లో చీలిక.. ఆదిలాబాద్‎లో తెరపైకి కొత్త రాజకీయం..

ఇచ్చిన మాటను తప్పని సమాజం.. సంస్కృతి సంప్రదాయాలకు కలిసి కట్టుగా సాగే నైజం. కానీ ఇప్పుడు ఆ సమాజం చీలిక వైపుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా బ్రతుకుతున్నా.. అడవి కోసం, అటవీభూమి కోసం, భుక్తి కోసం, జల్ జంగిల్ జమీన్ అంటూ సమిష్టిగా కొట్లాడిన ఆ జనం ఇక ఎవరి హక్కులు వారికే కావాలంటూ తెగలుగా విడిపోయి పోరాటానికి సిద్దమవుతోంది.

లోక్ సభ ఎన్నికల వేళ ఆదివాసీ తెగల్లో చీలిక.. ఆదిలాబాద్‎లో తెరపైకి కొత్త రాజకీయం..
Adilabad Tibals

Edited By:

Updated on: Apr 11, 2024 | 6:47 AM

ఇచ్చిన మాటను తప్పని సమాజం.. సంస్కృతి సంప్రదాయాలకు కలిసి కట్టుగా సాగే నైజం. కానీ ఇప్పుడు ఆ సమాజం చీలిక వైపుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా బ్రతుకుతున్నా.. అడవి కోసం, అటవీభూమి కోసం, భుక్తి కోసం, జల్ జంగిల్ జమీన్ అంటూ సమిష్టిగా కొట్లాడిన ఆ జనం ఇక ఎవరి హక్కులు వారికే కావాలంటూ తెగలుగా విడిపోయి పోరాటానికి సిద్దమవుతోంది. ఇన్నాళ్లు అందరం కలిసి పోరాటం చేస్తే ఫలితం మాత్రం ఒకే తెగకు దక్కుతూ వచ్చిందని.. విద్యా , వైద్యం, రాజకీయ , మౌలిక వసతుల అభివృద్ది ఫలాలన్నీ ఒక్క తెగకే సొంతమవుతున్నాయంటోంది ఆ సమాజం. తమ ఆదివాసీల్లోని తొమ్మిది తెగలలో ఐదు తెగలు అన్యాయానికి గురవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అడవుల జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ సాక్షిగా ఐక్య పోరాటానికి పిలుపునిచ్చింది. విద్యా , వైద్యం , రాజకీయ అభివృద్దే లక్ష్యంగా ఒక్కటైన ఐదు తెగలు ఐక్య వేదికగా ఏర్పడి సమావేశం ఏర్పాటు చేసుకోవడం కలకలం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ ఆదివాసీ సమాజంలో చీలిక రావడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అన్న చర్చ కు దారి తీసింది.

ఆదివాసీల హక్కుల పోరాటం కోసం ఇన్నాళ్లు ఒక్కటిగా సాగిన తొమ్మిది తెగలలో.. ఐదు తెగలైన పర్ దాన్, తోటి, కోలం, నాయక్ పోడ్ , ఆంద్ తెగలతో ఆదివాసీ ఐక్యవేదిక ఏర్పాటు కావడం సంచలనంగా మారింది. విద్యా , వైద్యం , రాజకీయంగా అన్ని ప్రభుత్వాలు మా ఐదు తెగలను విస్మరిస్తూ వస్తున్నాయని.. లోక్ సభ ఎన్నికల వేళ తమ సత్తా చాటలని నిర్ణయం తీసుకున్నాయి. ఆదివాసీల్లో ప్రదానమైన ఈ ఐదు తెగల ముఖ్య నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఐక్య కార్యాచరణకు సిద్దమవడం ప్రధాన పార్టీలను ఆలోచనలో పడేసింది. ఓట్ల పరంగా లక్షకుపైగా ఓటు బ్యాంకును కలిగి ఉన్న ఈ ఐదు తెగల ఆదివాసీలు.. ఐక్యంగా ఎలాంటి నిర్ణయంతో ముందడుగు వేస్తారో అన్న చర్చ జిల్లాలో తెర మీదకొచ్చింది.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రధాన పార్టీలు ఆదివాసీల అభ్యర్థులకే పట్టం కట్టినా.. గోండు సామాజిక వర్గానికి చెందిన ఆదివాసీ నేతకే టికెట్ ఖరారు చేయడంతో అదే ఆదివాసీ సమాజంలో ఉన్న మిగిలిన ఎనిమిది తెగల పరిస్థితి ఏంటని నిలదీస్తోంది ఐదు తెగల ఆదివాసీ ఐక్య వేదిక. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 1 లక్షా 30 వేల ఓటు బ్యాంకుకు పైగా ఉన్న తమ సమాజంలో తమ వంతు వాటా ఏదని ప్రశ్నిస్తోంది. ఆదివాసీ తెగల్లో ప్రధానమైన 5 తెగలకు రాజకీయంగా కనీస గౌరవం దక్కడం లేదని.. విద్యా, వైద్యంలోను వెనకబడి ఉంటున్నాం అంటోంది 5 తెగల ఐక్య వేదిక. రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికల్లో న్యాయం జరగలేదని కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా లాభం జరుగుతుందని ఆశపడితే ఈసారి‌కూడా నిరాశే ఎదురైందని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

రాజకీయంగా అవకాశం లేక పోయినా అభివృద్దిలోను తమ స్థానం కనిపించడం లేదని నిలదీస్తోంది 5 తెగల ఆదివాసీ సమాజం. ఇలాగైతే కుదరదు ఇక తాడో పేడో తేల్చుకోవడమేనంటూ ఆదిలాబాద్‎లోని యాదవ సంఘ భవనంలో ఐదు తెగల నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని ఐక్య నిర్ణయం తీసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఐదు తెగల నుండి బలమైన నాయకున్ని బరిలోకి దింపి తమ ఉనికిని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీలకు అతీతంగా ఐదు తెగల నేతలంతా ఒక్కటవడం జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. చూడాలి ఈ ఐదు తెగల సమిష్టి పోరాటం రాజకీయ సమీకరణలను ఎలా ప్రభావితం చేయనుందో.. ఆదిలాబాద్ పార్లమెంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..