AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రికే ఝలకిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే..!

సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎమ్మెల్యేనైనా. ఎంపీ అయినా, మంత్రులైనా.. మర్యాద పూర్వకంగా కలుస్తుంటారు. కానీ ఆ MLA మాత్రం నేనింతే.. అంటున్నాడు.

ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రికే ఝలకిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే..!
Mla Donthi Madhav Reddy
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 20, 2024 | 10:45 PM

Share

ఆ ఎమ్మెల్యే సైలెంట్.. కానీ ఫుల్ వైలెంట్..! ముఖ్యమంత్రి అయితే ఏంటి..? సీఎం వస్తే వంగి వంగి దండాలు పెట్టాలా..? యస్ ఇదే ఆయన పాలసీ..! నేనింతే అంటున్న ఆ ఎమ్మెల్యే అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన జిల్లాకు వస్తే లైట్ తీసుకున్న ఆ ఎమ్మెల్యేను చూసిన కొందరు ఆడు మగాడ్రా బుజ్జి! అంటుంటే.. మరికొందరు మొండోడు అంటున్నారు. ఇంకొందరు అది అహంకారం తలకెక్కడమే అంటున్నారు. అసలేం జరిగింది.? అధికారిక పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని ఆ ఎమ్మెల్యే ఎందుకు లైట్ తీసుకున్నారు.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎమ్మెల్యేనైనా. ఎంపీ అయినా, మంత్రులైనా.. మర్యాద పూర్వకంగా కలుస్తుంటారు. కానీ ఆ MLA దొంతి మాధవరెడ్డి మాత్రం నేనింతే.. అంటున్నాడు. సిఎం అయితే నాకేంటి అన్నట్లు.. స్వంత పార్టీ ముఖ్యమంత్రిని లైట్ తీసుకుంటూ నిత్యం చర్చగా మారుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లో నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి తనదైన శైలితో హాట్ టాపిక్ గా మారాడు.. ముఖ్యమంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సెక్రటేరియేట్‌కు వెళ్లి సీఎంకు శుభాకాంక్షలు తెలపని ఈ ఎమ్మెల్యే, తాజాగా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో అధికారిక పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను కనీసం మర్యాద పూర్వకంగా కలవకపోవడం చర్చగా మారింది. ఇప్పటికి మూడు సార్లు సీఎం వరంగల్ కు వచ్చినా, ఆయన్ను మాత్రం ఎమ్మెల్యే కనీసం మర్యాద పూర్వకంగా కలవక పోవడం విశేషం.

సీఎం అయితే నాకేంటి.. అన్నట్లు ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే ఉండి కూడా లైట్ తీసుకున్నారు. తొలిసారి అధికారిక పర్యటనకు వచ్చిన సమయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలవకపోవడం అప్పట్లో జనంలో చర్చగా మారింది. తాజాగా మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మంగళవారం(నవంబర్ 19) హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. హనుమకొండ కు వచ్చిన సీఎం కాళోజీ కళాక్షేత్రం, సభ ప్రాంగణంలో కలిపి సుమారు మూడున్నర గంటల పాటు హనుమకొండలో ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో జరిగాయి.

ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంను లైట్ తీసుకున్న ఎమ్మెల్యే దొంతి వాళ్ళతో కలిసి ఎక్కడా అధికారిక కార్యక్రమంలో పాల్గొన లేదు.. కనీసం మర్యాద పూర్వకంగా కలవలేదు. సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు వస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కచ్చితంగా వెళ్లి స్వాగతం పలుకుతారు. పార్టీలకతీతంగా మర్యాద పూర్వకంగా కలవడం, పలకరించడం ఆనవాయితీ. కానీ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏకంగా ముఖ్యమంత్రిని లైట్ తీసుకోవడం.. ఎమ్మెల్యే సొంత జిల్లాలో సీఎం గంటల తరబడి పర్యటించినా కనీసం ఆయనను కలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డి vs మాధవరెడ్డి మధ్య ఈ తరహా సన్నివేశం ఇదే ప్రథమం కాదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ జరిగింది. ములుగు నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌కు పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా, నర్సంపేటలో రేవంత్ రెడ్డికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఆయనను ఆహ్వానించ లేదు. దీంతో నియోజకవర్గం జంప్ చేసి.. మహబూబాబాద్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తన పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా నర్సంపేటలో రేవంత్ రెడ్డి ప్రచారానికి రాలేదు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరరయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. సీఎం అయితే నాకేంటి అన్నట్టు లైట్ తీసుకున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి నేనింతే.. నాకు నచ్చినట్టు నేనుంటా.. నిక్కచ్చిగా ఉంటా.. అన్నట్లు దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి రాజకీయ చర్చకు దారితీస్తోంది. దొంతిమొదటి వ్యవహారాన్ని కొందరు మూర్ఖత్వం అంటుంటే కాదు కాదు ముండోడు అని మరి కొందరు అంటున్నారు ఇంకొందరైతే సపరేట్ అంటున్నారు.

అయితే దొంతి మాధవరెడ్డి సీఎంని కలవక పోవడం వెనుక మంత్రి పదవే ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆయూవుపట్టుగా ఉన్న తనకు అన్యాయం చేశారని ఆగ్రహంతో ఉన్నారట. జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఎట్లైతే పార్టీని కాపాడారో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను కూడా అదే రీతిలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నానని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం జరిగినప్పుడు నేనెందుకు ముఖ్యమంత్రిని గౌరవించాలని భావనతో ఉన్నారని సమాచారం..!

మంత్రి పదవి ఇవ్వకపోవడం.. పార్టీలో జూనియర్లకు ఇవ్వడం వల్లే ఆయన అలిగి సీఎంను లైట్ తీసుకున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా అందరితోపాటే తనకు కూడా నిధులు వస్తాయి. నేను ప్రత్యేకంగా సీఎం కలవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి..? అందుకే సీఎంను కలవడానికి ఆసక్తి చూపడం లేదని చర్చ జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..